బైసరన్ లోయ(Baisaran Valley). ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామమైన జమ్మూకశ్మీర్ లోని చాలా సుందర ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ భూతల స్వర్గం కొలువై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు.. వంపులు వంపులుగా ఉండే కొండలు.. పచ్చదనం అక్కడే పుట్టిందా అన్నంత అందగా కనిపించే పరిసరాలు.. వాటితో కూడిన ఆహ్లాద వాతావరణం.. బైసరన్ లోయకు పర్యాటకులను క్యూ కట్టేలా చేస్తాయి. ట్రెక్కింగ్ ను ఇష్టపడే సాహస యాత్రికులు.. బైసరన్ లోయలో పండగ చేసుకుంటారు. ఉరిమే ఉత్సాహంతో బైసరన్ పరిధిలో ఉన్న కొండలను ఎక్కేస్తూ.. తమ అభిరుచిని పూర్తిగా అనుభవిస్తూ సంతోషిస్తుంటారు. అదృష్టం ఉంటే తప్ప.. బైసరన్ లోయకు రాలేము అంటూ.. పర్యాటకులు పదే పదే చెబుతారంటే.. అక్కడి ప్రకృతి సంపద.. టూరిస్టులను ఎంతగా ఆకర్షిస్తుందన్నది మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంతటి ప్రకృతి రమణీయతను సొంతం చేసుకుంది కాబట్టే.. బైసరన్ లోయకు మినీ స్విట్జర్లాండ్(Mini Switzerland) అని పేరు. ఇదేదో టూరిస్టులను ఆకర్షించేందుకు పెట్టిన పేరు అనుకుంటే అది కచ్చితంగా పొరబాటే. యూరోపియన్ నేచర్ బ్యూటీని ఎంజాయ్ చేయాలని ఆరాటపడేవారికి.. ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఆల్పైన్ చెట్ల పొదలు, పచ్చిక బయళ్లు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు.. ఇలాంటి వాటిని చూసేందుకు ఉన్న రెండు కళ్లు సరిపోవంటే.. ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. అద్భుతమైన పర్వతాలు.. వాటిని సందర్శించేందుకు వచ్చిన వారికి గ్రీన్ కార్పెట్ పరిచినట్టుగా ఉండే పైన్ చెట్ల అడవులు.. వాటిపైనుంచి పర్వత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్తుంటే కలిగే అనుభూతి.. ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చూసినా అదో అద్భుతమైన అనుభూతే. ఈ విషయాన్ని బైసరన్ లోయకు చెందిన వాళ్లే కాదు. అక్కడికి వెళ్లి వచ్చిన ఎవర్ని కదిలించినా.. ఇదే చెబుతారు.
ఇంతటి అందమైన ప్రాంతాన్ని, అక్కడి ప్రకృతి సంపదను కాపాడేందుకు జమ్మూకశ్మీర్ అధికారులు కీలక చర్యలు అమలు చేస్తున్నారు. పహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయకు.. ట్రాన్స్ పోర్టేషన్ ను నిలిపివేశారు. అక్కడికి వెళ్లాలంటే.. ఆ ప్రకృతి సౌరభాన్ని ఆస్వాదించాలంటే.. ఆ రమణీయతలో మమేకం కావాలంటే.. కచ్చితంగా నడిచి కానీ, చిన్న చిన్న గుర్రాలపై కానీ వెళ్లాల్సిందే. ఈ విషయం తెలిసి కూడా.. నిత్యం వందల సంఖ్యలో.. ఏటా లక్షల సంఖ్యలో ఈ ప్రాంతాన్ని టూరిస్టులు విజిట్ చేస్తుంటారు. హనీమూన్ జంటలు పెద్ద సంఖ్యలో బైసరన్ కు వెళ్తుంటాయి. మేఘాలతో కలిసిపోయినట్టుగా కనిపించే కొండల అందాలను చూస్తూ.. ప్రకృతి ఒడిలో పర్యాటకులు సేదతీరుతుంటారు. పచ్చని మైదానాల్లో నడుస్తూ తమను తామే మరిచిపోతుంటారు. ఒక్కసారి వచ్చినవాళ్లు.. అక్కడితో ఆగకుండా మళ్లీ మళ్లీ బైసరన్ కు వస్తూ.. అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు.
ప్రకృతి రమణీయతకు, పచ్చందనాల అందాల సొబగులకు కేరాఫ్ గా నిలుస్తున్న ఈ ప్రాంతంలో.. ఇంతటి మారణహోమం జరగడం.. పర్యాటకులను మాత్రమే కాదు.. దేశ ప్రజలందరినీ కలిచివేసింది. అత్యంత త్వరగా.. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనాలని.. పర్యాటకులకు భద్రత సదుపాయాలు మెరుగుపడాలని అంతా కోరుకుంటున్నారు. బైసరన్ లోయకు సంబంధించి ఈ విశేషాలు మీకు నచ్చితే.. అందరికీ షేర్ చేయండి.