తిరుమల శ్రీవారి భక్తులకు ఒక కీలక సమాచారం. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు మరో ప్రదేశానికి మార్చనున్నారు. భక్తుల రద్దీ తగ్గించేందుకు, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అదనపు ఈవో కార్యాలయంలో ఉన్న టికెట్ కౌంటర్‌ను, ముందుగా తాత్కాలికంగా జర్మన్ షెడ్‌లలోకి మార్చగా, ఇప్పుడు శాశ్వతంగా అన్నమయ్య భవన్ ఎదురుగా ఉన్న కొత్త భవనంలోకి మార్చనున్నారు. ఈ కౌంటర్ వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు, అవసరమైన ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. మరో వారం రోజుల్లో ఇది ప్రారంభం కానుందని టీటీడీ వెల్లడించింది.
ఇక తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో భక్తులకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. గతంలో భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులు టోకెన్ల కోసం తోపులాటకు గురయ్యేవారు. ఇప్పుడు నారాయణగిరి తరహాలో శాశ్వత క్యూషెడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎండ, వాన నుండి రక్షణ లభిస్తోంది.
వేసవి రద్దీ నేపథ్యంలో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగింది. గురువారం రోజున తిరుప్పావడ సేవ, పూలంగి సేవల కారణంగా సాధారణంగా భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈసారి అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమన్వయంతో దాదాపు 72,579 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇది గురువారానికే అత్యధిక సంఖ్యగా పరిగణించబడుతోంది. అన్ని విభాగాల సిబ్బంది సహకారానికి టీటీడీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.