ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముమ్మిడివరం వద్ద గోదావరిలో స్నానానికి దిగిన 11 మంది యువకుల్లో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మొదట ఒకరు మునిగిపోతుండగా, అతన్ని కాపాడే ప్రయత్నంలో మిగతా ఏడుగురు కూడా నీళ్లలో కలిసిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, SDRF బృందాలు, గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ యువకులు కాకినాడ, మండపేట, రామచంద్రపురం ప్రాంతాలకు చెందిన వారు. శేరిలంకలో శుభకార్యానికి హాజరై భోజనానంతరం గోదావరి వద్దకు వెళ్లారు. ప్రమాద సమయంలో వడ్డే మహేష్ (16), వడ్డే రాజేష్ (14), ఎలిపే మహేష్ (14), సబిత క్రాంతి ఇమాన్యేలు (19), సబిత పాల్ (18), తాటిపూడి నితీష్ (18), ఎలుమర్తి సాయి (18), రోహిత్ (18) అనే ఎనిమిది మంది గల్లంతయ్యారు. దాసరి కరుణకుమార్, మేడిశెట్టి చరణ్ రోహిత్, కనికెళ్ల సురేష్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
గతరాత్రి నుంచే సహాయక చర్యలు కొనసాగుతుండగా, కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.