కాంగ్రెస్ హైకమాండ్ నాలుగు కొత్త మంత్రుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరుగా ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే వారి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
సోమవారం ఢిల్లీలో టెన్‌జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వేరుగా భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ రూపకల్పన, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, కవిత లేఖ తదితర అంశాలపై రాహుల్ సమీక్షించినట్లు సమాచారం.
నలుగురు మంత్రుల పదవులకుగాను ఏడుగురి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీసీసీ కార్యవర్గ సభ్యుల జాబితా కూడా రాహుల్‌కు అందజేశారు. మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించాలని మహేశ్ గౌడ్ అడిగినట్లు తెలిపారు.
మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఢిల్లీ బయట ఉండటంతో మంగళవారం జరిగేలా ఉన్న ప్రకటన వాయిదా పడింది. ఖర్గే ఈనెల 30న ఢిల్లీకి చేరుకుంటే, జూన్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విస్తరణపై ఇప్పుడు పార్టీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.