యూపీలో హలాల్ సర్టిఫికెట్(Halaal certificate) ఉత్పత్తుల నిషేధం అంశంపై సర్వోన్నత న్యాయస్థానం(supreme copurt) విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా, కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా(Thushar Mehtha) మాట్లాడుతూ, ఇనుప కడ్డీలు, సిమెంట్ వంటి ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికెట్ అవసరమా అని ప్రశ్నించారు. గతంలో యూపీ ప్రభుత్వం హలాల్ సర్టిఫికెట్ కలిగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తుషార్ మెహతా, ‘‘మాంసం ఉత్పత్తులకు హలాల్ ధ్రువీకరణ అవసరం అని ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, సిమెంట్, ఇనుప కడ్డీలు, బాటిల్స్ వంటి వస్తువులకు ఈ సర్టిఫికెట్ రావడం ఏంటో?’’ అని అన్నారు. హలాల్ సర్టిఫికెట్ జారీచేసే సంస్థలు పెద్ద మొత్తంలో వసూళ్లను చేస్తున్నాయని, ఈ వసూళ్లు లక్షల కోట్ల రూపాయల్లో ఉన్నాయని ఆయన వివరించారు. ‘‘గోధుమ పిండి, శెనగపిండి, నీళ్ల సీసాలు వంటి వస్తువులకు కూడా హలాల్ అవసరమా?’’ అని ఆయన ప్రశ్నించారు.
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్. షంషాద్ వివరణ ఇస్తూ, ‘‘హలాల్ సర్టిఫికెట్ పొందడం స్వచ్ఛందమైన వ్యవహారమే, దాన్ని తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదు’’ అని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగమని, జీవన విధానానికి సంబంధించిందని తెలిపారు.
ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మస్హి, జస్టిస్ బీఆర్ గవాయ్ ల ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 24 తరువాత నిర్వహించేందుకు నిర్ణయించారు. నవంబర్ 2023లో, ఉత్తరప్రదేశ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హలాల్ సర్టిఫికెట్ కలిగిన వస్తువుల విక్రయంపై నిషేధం విధిస్తూ, తక్షణమే అమలు చేయాలని ప్రకటించింది.
హలాల్ సర్టిఫికెట్ ద్వారా వినియోగదారులపై అధిక భారం పడుతోందని, ఇది ఆహార ఉత్పత్తుల నాణ్యతను అర్థం చేసుకోవడంలో గందరగోళం సృష్టిస్తుందని యూపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది.