2025 కేంద్ర బడ్జెట్‌లో(Budget 2025) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) రైతులకు కొన్ని మంచి వార్తలు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5లక్షలకు పెంచాలని నిర్ణయించారు. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపొందించేందుకు స్వయం సమృద్ధి పథకం కింద కంది, మినుములు, మసూర్ పప్పులను కొనుగోలు చేయాలని ప్రకటించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకం తీసుకురాబోతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ(Indian economic system) అధిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో ఒకటిగా నిలిచిందని, వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడుల వంటి రంగాల్లో సమూల మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు. పీఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించామని, దీనిని 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని, వలసలు అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెప్పారు. పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళికను రూపొందించామని, పత్తి రైతుల కోసం ఐదు సంవత్సరాల ప్రణాళిక తీసుకురాబోతున్నామని తెలిపారు. కొత్త రకం పత్తి సాగుకు ప్రోత్సాహం ఇవ్వడం, బీహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం, అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను కూడా ప్రకటించారు.