జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్.. దేశ ప్రజలను ఒక్కసారిగా వణికించింది. 30 మందికి పైగా టూరిస్టులు బలైన ఘటనతో.. అంతా తల్లడిల్లిపోయారు. మరోవైపు.. ఉగ్రదాడి ఘటనతో కశ్మీర్ లోని పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పిల్లాపాపలతో కలిసి టూరిజం కోసం వెళ్లిన వాళ్లంతా.. క్షణాల్లో తిరుగుప్రయాణమయ్యారు. ఘటన జరిగిన తర్వాత.. బుధవారం నాడు కేవలం ఆరే గంటల్లో.. ఏకంగా 3 వేల 300 మంది టూరిస్టులు వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచి బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 20 విమనాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయి. వీటి ద్వారా.. 3 వేల 337 మంది తమ స్వస్థలాలకు వెళ్లారు. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారికంగా వెల్లడిస్తూ.. శ్రీనగర్ విమానాశ్రయంలోని తాజా పరిస్థితిని వివరించారు.
ఉగ్రదాడుల భయంతో కశ్మీర్ నుంచి విమానాల్లో తిరుగు ప్రయాణమైన వారందరకీ.. ఎయిర్ పోర్టులో తగిన వసతి కల్పించినట్టు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) తెలిపారు. పరిస్థితిని గుర్తించి అదనపు విమానాలు కూడా సిద్ధం చేశామన్నారు. రద్దీకి తగినట్టుగా మంచినీరు, ఆహార వసతిని కూడా కల్పించినట్టు చెప్పారు. పర్యాటకుల అత్యవసర ప్రయాణ అవసరాన్ని గుర్తించి.. టికెట్ ధరలను విమానయాన సంస్థలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. పర్యాటకులకు మనమంతా అండగా నిలవాలని, వారి మనోభావాలను గౌరవించాలని రామ్మోహన్ నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) స్పందించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. అదనపు విమానాల్లోనే కాక.. రోడ్డు మార్గంలో కూడా పర్యాటకులను వారి స్వస్థలాలకు పంపించామన్నారు.
ఇక.. దాడి ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. మన దేశంపై కుట్ర చేస్తున్నవారిని వదిలే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్(Rajnath) హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్ లో ప్రస్తుతం 56 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. అందులో ఎక్కువగా లక్షరే తోయిబా(Lashkar-e-Taiba) సంస్థకు చెందిన వారేనని వెల్లడించాయి. స్థానికంగా 17 మంది టెర్రరిస్టులున్నట్టు గుర్తించామన్నాయి. కశ్మీర్ కు టూరిస్టుల రాక పెరిగిన నేపథ్యంలో.. అదును చూసి మరీ టెర్రరిస్టులు ఈ దాడికి తెగబడినట్టుగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. దాడి చేసిన తర్వాత అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపాయి. ఈ ఘటన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీతో పాటు ఇతర ప్రధాన నగరాల్లో భద్రతను రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టం చేశాయి.
సున్నితమైన ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తూ.. ఉగ్ర జాడను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా.. బైసరన్ లోయలో జరగిన దాడి.. యావత్ దేశాన్ని కలచివేసిందని చెప్పవచ్చు.