జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) లోని బైసరన్(Bysaran) లోయలో జరిగిన ఉగ్ర రక్తపాతంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటన వెనక పాకిస్తాన్ హస్తం కచ్చితంగా ఉందని కేంద్రం ఆరోపిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా ఉగ్రవాదా(terrorism)న్ని ప్రోత్సహించడాన్ని పాక్(Pakistan) మానుకోవడం లేదని ఆగ్రహిస్తోంది. ఈ సారి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని.. పాక్ ఆయువుపట్టుపై దెబ్బ కొట్టాలని కేంద్రం తీవ్రమైన రీతిలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా.. అటారీ వాఘా(Attari-Wagah) చెక్ పోస్టును తక్షణమే మూసివేయడం. అంటే.. పాక్ తో ఈ సరిహద్దు మీదుగా ఎలాంటి చర్యలు, ప్రతిచర్యలు ఇకపై ఉండవు. ఎలాంటి లావాదేవీలు జరగవు. పాక్ నుంచి మన దేశంలోకి వచ్చే వాళ్లకు ఇకపై ఎలాంటి ప్రవేశం కూడా ఉండదు. భారత్ కు చెందిన వాళ్లు ఎలాగూ పాక్ కు వెళ్లి బతకాల్సిన అవసరం లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతుకు తెరువు లేని చాలా మంది ఏదో రకంగా భారత్ కు వచ్చి బతకాలని చూస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ.. వాఘా సరిహద్దు మూసివేత.. శాపంగా పరిణమించనుంది. పాక్ వాణిజ్యంపై తీవ్ర దెబ్బ కొట్టనుంది.
మరో కీలక నిర్ణయం.. పాక్ ను కూడా షాక్ కు గురిచేసే నిర్ణయం.. సింధూ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty`) నిలిపివేయడం. దీనిపై.. కాస్త డిటెయిల్డ్ గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే.. మన దేశంలో ప్రవాహం మొదలయ్యే సింధూ నది.. మన పంజాబ్ మీదుగా.. పాక్ లోని పంజాబ్ లోకి ప్రవహిస్తుంది. దీనిపై పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా పరోక్షంగా 75 శాతం ఆధారపడినట్టు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సింధూ నదిపై.. పాక్ తో గతంలో కుదిరిన ఒప్పందాన్ని మన దేశం ఇప్పుడు నిలిపివేయడం అంటే.. కచ్చితంగా అది పాక్ ఆర్థిక మూలాలపై భారీ దెబ్బ కొట్టినట్టే. అంతే కాక.. సింధూ నదిపై మన దేశంలోనే ఆనకట్టలు కట్టి నదీ ప్రవాహాన్ని ఇక్కడే ఆపాలని కేంద్రం ప్రయత్నించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే.. పాక్ ఎడారి కావడం ఖాయమన్న అంచనాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భిక్షమెత్తుకునే స్థాయికి పాక్ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఇప్పుడు భారత్ చెబుతున్నది గనక చేసి చూపిస్తే.. ఆ తర్వాత పాకిస్తాన్ అతలాకుతలం కావడం ఖాయమని అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు.
ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలను అమలు చేసింది. మన దేశంలో ప్రస్తుతం ఉన్న పాక్ దేశ పర్యాటకులు.. తక్షణమే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించింది. సరిహద్దుల మీదుగా ఇటీవలే వచ్చినవాళ్లు కూడా 48 గంటల్లో భారత్ ను వీడాలని ఆర్డర్స్ పాస్ చేసింది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాక్ రాయబార కార్యాలయ సిబ్బందిని 55 నుంచి 30 కి తగ్గించాలని కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీలకు ప్రత్యేక వీసాల జారీని సైతం నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఫలితంగా.. ఆ దేశానికి చెందిన వందలాది మంది.. మన దేశంలో పొందుతున్న వైద్య సేవలు, ఇతర సౌకర్యాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడ్డట్టు అయ్యింది. ఇదిలా ఉంటే.. పాక్ మాత్రం పాత పాటే పాడింది. జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడి వెనక.. తమ దేశం లేదని బుకాయిస్తోంది. భారతదేశం చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతోంది. ఉగ్రదాడి ఘటనపై తాము కూడా ఆవేదన చెందుతున్నట్టు.. మొసలి కన్నీరు కారుస్తోంది.
బైసరన్ లోయలో ఉగ్రదాడి వెనక తమ ప్రమేయం లేదని పాక్ ఎంతగా బుకాయిస్తున్నా.. కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టుగానే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పక్కా ఆధారాలతో.. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ బట్టలిప్పి అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశ స్వభావాన్ని బయటపెట్టే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పాక్ ను పూర్తిగా వెలి వేసే దిశగా.. భారత్ తీసుకుంటున్న ఈ చర్యలకు అంతర్జాతీయంగా విశేష మద్దతు లభిస్తోంది. ఈ వ్యవహారంలో. పాక్ ఒంటరైపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.