2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో వచ్చిన “ఏ మాయ చేసావే” (Ye Maaya Chesave) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత (Samantha). అందులో జెస్సీ (Jesse) గా ఆమె కనబరిచిన నటన కుర్రాళ్ల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె అందించిన అనుభూతి, భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను మైమరిపించింది. తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత సమంత వరుస విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది.. “బృందావనం” (Brindavanam), “ఈగ” (Eega), “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” (Seethamma Vakitlo Sirimalle Chettu), “అఆ” (A Aa), “రంగస్థలం” (Rangasthalam), “మజిలి” (Majili) వంటి హిట్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రతి పాత్రలో ఆమె చూపిన నమ్మకం, నిజాయితీ, ఎమోషన్ ప్రేక్షకులను మైమరపించాయి. రాజమౌళి (Rajamouli), నాని (Nani) కాంబినేషన్లో వచ్చిన ‘ఈగ’ (Eega) సినిమాలో సమంత పర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. సమంత నటనతో కాదు వ్యక్తిత్వంతో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.
సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచే సమంత, మహిళల హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తుతూ ఉంటుంది. ఫిట్‌నెస్, మైండ్ ఫుల్‌నెస్ విషయంలో కూడా ఆమె యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 2021లో “ది ఫ్యామిలీ మాన్ 2” (The Family Man 2) వెబ్ సిరీస్‌తో సమంత పేరు మార్మోగిపోయింది. అందులో “రాజీ” (Rajee) అనే పాత్రలో సమంత చూపిన ఇంటెన్సిటీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల వచ్చిన ‘సిటాడెల్’ (Citadel) వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది.
2017లో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ను వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మానసికంగా బాధపడిన ఆమె ఆ తర్వాత మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడింది. కొన్నాళ్లు అమెరికాలో చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ఆరోగ్య సమస్యల సమయంలో కూడా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతూ, “యశోద” (Yashoda), “శాకుంతలం” (Shaakuntalam) వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇటీవలే నిర్మాతగా మారిన సమంత ‘శుభం’ (Shubham) అనే సినిమాని నిర్మిస్తోంది. సి.మల్గిరెడ్డి (C. Malgireddy), గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం (Shriya Kontham), చరణ్ పెరి (Charan Peri), షాలిని కొండేపూడి (Shalini Kondepudi), గవిరెడ్డి శ్రీనివాస్ (Gavireddy Srinivas) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ (Cinema Bandi) ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 9న ఈ సినిమా విడుదల కానుంది.
సమంతకు నటనపై ఉన్న నిబద్ధత, జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం, సమాజంపై చూపే శ్రద్ధ ఆమెను మిగతా నటీమణుల నుంచి ప్రత్యేకంగా నిలబెడతాయి. ఆమె కథ ఓ మహిళ తమ కలల్ని ఎలా సాకారం చేసుకోవాలో చూపించేందుకు గొప్ప ఉదాహరణ అనడం అతిశయోక్తి కాదేమో. హ్యాపీ బర్త్‌డే సమంత.