మాజీ ప్రధాని మరియు తెలంగాణ గర్వంగా భావించే పీవీ నరసింహారావుకు ఢిల్లీలో ఒక అరుదైన గౌరవం లభించబోతోంది. ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) సూచన మేరకు, ఈ విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం ఢిల్లీలోని పాత ఏపీ భవన్‌ను రెండు రాష్ట్రాలకు విభజించారు. ప్రస్తుతం ఆ భవన్‌లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల కార్యాలయాలు కలిపి ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఏపీ మాజీ సీఎం ప్రకాశం పంతులు విగ్రహం ఉంది. అతని పక్కనే పీవీ విగ్రహాన్ని పెట్టే అవకాశం లేకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో కొత్తగా తెలంగాణ భవన్ నిర్మించాలనే నిర్ణయం తీసుకుంది. పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ విగ్రహ ఏర్పాటుకు ఎన్డీఎంసీకి విజ్ఞప్తి చేయగా, అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదంతో ప్రణాళికలు వేగం పుంజుకున్నాయి. నూతన భవనం సిద్ధమైన తర్వాత విగ్రహాన్ని అక్కడికి తరలించే అవకాశముంది.
పీవీ నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఏకైక నేత. అయితే ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల అనుచితంగా వ్యవహరించింది. ఆయన పార్థివదేహాన్ని పార్టీ కార్యాలయంలో ఉంచేందుకు అనుమతించలేదు. ప్రధాని స్థాయిలో సేవలందించిన పీవీకి ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నారు. అందువల్ల ఆయన అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్వహించాల్సి వచ్చింది.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పీవీకి సరైన గుర్తింపు వచ్చింది. ఢిల్లీలో ఆయన స్మారక స్థూపం నిర్మించడమే కాక, భారతరత్న పురస్కారాన్ని కూడా ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయడంలో కూడా ఎన్డీఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.