YS Jagan : గురి పెట్టిన జగన్.. దేనిపైనో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో 2019లో అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అంతకుమించిన దారుణమైన ఫలితాన్ని పొంది.. 2024లో ప్రతిపక్షానికి పరిమితమైనంది. కనీసం.. ప్రధాన ప్రతిపక్షానికి అవసరమైనన్ని సీట్లు కూడా సాధించలేక.. ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. కానీ.. పట్టు వదలని విక్రమార్కుడి లాంటి పేరున్న జగన్.. తన పార్టీకి మళ్లీ పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వెదుకుతున్నారు. కేంద్రం పట్టుదలగా ఉన్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తరుణంలో.. వారి తప్పులను ఎండగడుతూ.. వేగంగా జనాల్లోకి వెళ్లేందుకు స్కెచ్చేశారు. ఏ మాత్రం అవకాశం దొరికినా.. కూటమి ప్రభుత్వాన్ని జనాల్లో దోషిగా నిలబెట్టేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయత్నంలోనే.. జగన్ కు జమిలీ ఎన్నికలు ఓ అవకాశంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల పార్టీ కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలోనూ జగన్ ఇదే విషయంపై ప్రస్తావించినట్టు తెలుస్తోంది. 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయనీ.. తర్వాత.. 2029లో జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రతిపాదన ఉందని జగన్ చెప్పారట. కానీ.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు.. రెండేళ్ల వ్యవధిలో రెండు సార్లు ఎన్నికలు నిర్వహించడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని అని.. ఈ కారణంగా.. దేశం మొత్తం 2027లోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని జగన్ అంచనా వేశారట. కాదంటే.. 2028 ప్రారంభంలో అయినా కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారట. అందుకే.. వైసీపీ కార్యకర్తలు, నేతలు.. ఈ వాస్తవాన్ని గుర్తించి.. జనాల్లోకి వెళ్లేందుకు అవసరమైన ప్లాన్ చేయాలని జగన్ దిశానిర్దేశం చేశారట. సాధ్యమైనంత త్వరగా.. ఆ పని పూర్తి చేయాలని కూడా కేడర్ కు జగన్ స్పష్టం చేశారట.

మరోవైపు.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జమిలి ఎన్నికలు 2029 లో గానీ.. ఆ తర్వాత గానీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ. జగన్ మాత్రం 2027 లేదంటే.. 2028 అని చెబుతున్నారు. ఇందులో ఏది జరుగుతుందన్నదీ పక్కనబెడితే.. జగన్ మాత్రం తన పార్టీని యాక్టివ్ చేసేందుకు ఇలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. శాసనసభలో చెప్పుకునేంత ప్రాతినిధ్యం కూడా లేని తన పార్టీకి.. జనాల్లో మైలేజ్ తీసుకువచ్చేలా ఆయన ప్రణాళిక రూపొందించినట్టుగా తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎన్డీయేలో ఆయన ప్రత్యక్షంగా లేకున్నా కూడా.. బీజేపీతో అంతర్గతంగా సన్నిహిత సంబంధాలు ఉన్న నేత జగన్ అని చాలా మందికి తెలిసిన విషయమే. అలాంటి జగన్.. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని చెబుతున్నారంటే.. కచ్చితంగా విషయం ఉండే ఉంటుందని తన అనుచరులు, కార్యకర్తలు, పార్టీ వర్గాలు భావించాలని.. ఆ క్రమంలో ప్రజల్లోకి త్వరగా వెళ్లి పార్టీకి మైలేజ్ తెచ్చేలా వాళ్లంతా పని చేయాలని జగన్ కోరుకుంటున్నట్టుగా ఆయన మాట తీరును బట్టి అర్థమవుతోంది.

ఇదంతా చూస్తూ.. కాస్త విశ్లేషణ చేసుకుంటున్న వాళ్లంతా.. జగన్ ది పెద్ద ప్లానే.. అని ఆశ్చర్యంతో కూడిన ప్రశంసలు అందిస్తున్నారు. పార్టీకి పట్టు తీసుకురావడానికి ఇలా ముందునుంచే చర్యలు తీసుకోవడం మంచిదే అని అభిప్రాయపడుతున్నారు. కేడర్ ను కాపాడుకుంటూ.. మళ్లీ ఒక్కో అడుగూ పేర్చుకుంటూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజాబలాన్ని మళ్లీ సాధించేలా జగన్ అడుగులు వేస్తుండడాన్ని సమర్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here