ఐడీ టీవీ కుత్బుల్లాపూర్ ప్రాంతీయ కార్యాలయం.. ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే వివేకానందగౌడ్ తో పాటు.. ఐడీ టీవీ మెంటర్, ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి కార్యాలయాన్ని ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ ప్రజల గొంతుకగా.. ఈ ఛానల్ పని చేయాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. జర్నలిజంలో విలువలు పెరగాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఐడీ టీవీ పని చేయాలని.. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి నిలవాలని కోరారు.
అంతకుముందు.. పాశం యాదగిరి మాట్లాడారు. జర్నలిజం అంటే.. ఎవరికీ బాకాలు ఊదడం కాదని.. సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి.. వాటి పరిష్కారానికి పాటుపడేదే పాత్రికేయం అని చెప్పారు. ఐడీ టీవీ.. కచ్చితంగా పేద ప్రజల గొంతుకగా మారుతుందని స్పష్టం చేశారు. ఆ దిశగా.. తాను కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ప్రజల వాడుక భాషలో వార్తలను అందిచాల్సిన అవసరం చాలా ఉందన్నారు. సోషల్ మీడియానే ఇప్పుడు అసలైన జర్నలిజం చేస్తోందని చెప్పుకొచ్చారు. యూట్యూబ్ చానళ్ల ద్వారా.. ప్రతి విషయం ప్రజలకు నేరుగా అందుతోందని అన్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఐడీ టీవీ బృందాన్ని పాశం యాదగిరి ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమానికి ఐడీ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అంజిబాబు హాజరయ్యారు. నిజాన్ని నిర్భయంగా అందించేందుకు.. ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు ఐడీ టీవీ కృతనిశ్చయంతో ఉందని అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మార్గదర్శకత్వంలో త్వరలో జర్నలిజం కళాశాల కూడా ఏర్పాటు చేస్తున్నామని.. నిఖార్సైన పాత్రికేయాన్ని తమ సంస్థ నేతృత్వంలో బోధించనున్నామని చెప్పారు. అలాగే.. ప్రస్తుత తరానికి అనుగుణంగా.. ఛుట్కీ పేరుతో షార్ట్ న్యూస్ యాప్ ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరారు. కుత్బుల్లాపూర్ తో మొదలైన తమ ప్రయాణం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుతుందని.. అన్ని సెగ్మెంట్లలో తమ కార్యాలయాలు ప్రారంభించేందుకు తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతి కార్యాలయ ప్రారంభోత్సవానికి.. కుత్బుల్లాపూర్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్నే స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి.. స్థానిక కాలనీల నాయకులతో పాటు.. మహిళా సంఘాల ప్రతినిధులు, ఐడీ టీవీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఐడీ టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ఐడీ టీవీ విస్తరించాలని ఆకాంక్షించారు.