Telangana Cabinet Expansion: గత కొన్ని రోజులుగా ఆశావహులను ఊరిస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై.. కాస్త కదలిక వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై.. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్లు.. గాంధీభవన్ లో చర్చనీయాంశంగా మారాయి. కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీదే అని ఆయన చెప్పారు. జనవరిలోగా.. కార్పొరేషన్ ఛైర్మన్లు, బోర్డుల డైరెక్టర్ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేయాల్సిందిగా అధిష్టానం సూచించిందని తెలిపారు. అలాగే.. పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ.. ఫిబ్రవరిలో రాష్ట్రంలో పర్యటిస్తారని.. సూర్యాపేట, ఖమ్మంలో ఏదైనా ఒక ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు. ఈ లెక్కన.. రాహుల్ గాంధీ వచ్చే నాటికి.. కేబినెట్ విస్తరణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ, పొన్నం, సీతక్క, దుద్దిళ్ల, పొంగులేటి, జూపల్లి, కొండా సురేఖతో.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిపై చర్చించారు. ప్రభుత్వ పనితీరుపై KC.. సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాలవారిగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో కూడా.. గ్రామస్థాయిలో పలుకుబడి కలిగిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.
ఈ సమావేశం జరిగిన తీరును విశ్లేషిస్తే.. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఖాయమని తేలిపోతోంది. ఆ తర్వాత.. మంత్రివర్గంలో ఉన్న ఖాళీలను తేల్చి.. కొందరిని పదవుల నుంచి తప్పించి.. మరికొందరికి బెర్తులు కేటాయించే అవకాశాలున్నట్టు మహేశ్ గౌడ్ కామెంట్ల ఆధారంగా అర్థమవుతోంది. దీంతో.. పదవులు పోయేదెవరికి.. కొత్తగా మంత్రి యోగం దక్కేదెవరికి అన్నది గాంధీభవన్ వర్గాలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే నెల రాహుల్ గాంధీ వచ్చేనాటికి ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది.