హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు ప్రయాణ చార్జీల(Ticket Price) పెంపునకు టైమ్ వచ్చేసింది. బెంగళూరు మెట్రో(Bangalore metro) చార్జీలు సుమారు 50 శాతం వరకు పెరిగిన ప్రభావం.. హైదరాబాద్ మెట్రోపైనా పడింది. ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు టికెట్ ధరలు పెంచలేదని నిర్వాహకులైన ఎల్ అండ్ టీ సంస్థ(L&T Metro) యాజమాన్యం భావిస్తోంది. గతంలో.. ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో ఓ సారి చార్జీలు పెంచాలని భావించినా.. అప్పుడు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో.. ప్రతిపాదన అటకెక్కింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి.. దాదాపు ఏడాది కావొస్తోంది. రేవంత్(Revanth reddy) ప్రభుత్వం కూడా జనాల్లోకి వెళ్లి చాలా కాలమైంది. కాబట్టి.. ఈ సారైనా ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతుందా.. అంది ఎల్ అండ్ టీ ఆశిస్తోంది.
ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. అక్కడ 77 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు చేస్తున్నాయి. రోజుకు సుమారు 8 లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు. పెరిగిన చార్జీల ప్రకారం.. కనీస చార్జీని 10 రూపాయలుగానే కొనసాగిస్తున్నారు. కానీ గరిష్ట చార్జీని మాత్రం 60 రూపాయల నుంచి 90 రూపాయలకు పెంచేశారు. అంటే.. 50 శాతం పెంపును అమలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రయాణికుల నుంచి తీవ్రంగానే విమర్శలు వస్తున్నా.. నిర్వహణ భారం పేరుతో.. బెంగళూరులో మెట్రో చార్జీలు పెంచేశారు. ఈ ప్రభావంతోనే.. మన దగ్గర కూడా హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంచాలన్న ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది.