తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో కీలక మార్పులు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు(GHMC Elections).. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఇలా కీలక వ్యవహారాలు ముందున్న సందర్భంలో.. పార్టీ ఇంచార్జ్ నే మార్చేసి.. పార్టీ వ్యవహారాల్లో మరింత జోరు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్న నాయకత్వం.. ప్రస్తుతం ఉన్న దీపాదాస్ మున్షీని మార్చేసి.. వేరే నేతకు పార్టీ వ్యవహారాల బాధ్యత ఇవ్వాలని డిసైడైనట్టుగా వార్తలు వచ్చాయి. ఓ మాజీ ముఖ్యమంత్రి పేరు తాజాగా బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. పార్టీ వ్యూహాలు, వాటి అమలు.. మరింత తీవ్రంగా ఉండడం ఖాయమనన మాట.. కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది.
అన్నీ కుదిరితే.. వారంలోపే దీపాదాస్ మున్షీని మార్చేసే అవకాశం ఉంది. ఆమె పశ్చిమ బెంగాల్(West bengal) రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం.. ఏడాది లోపు బెంగాల్ ఎన్నికలు ఉండడంతో.. వ్యూహ రచనలో దిట్ట అయిన దీపాదాస్ మున్షీని(Deepdas Munshi) ఆమె సొంత రాష్ట్రానికి పంపించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటప్పుడు.. ఆమె స్థానంలో ఎవరు తెలంగాణ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు అన్నది గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు.. మరిన్ని ఇతర రాష్ట్రాల్లోనూ.. పార్టీ ఇంచార్జ్ ల మార్పు ఖాయమని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు తమ దగ్గర తగిన సమాచారం కూడా ఉందంటున్నారు.










