ఢిల్లీ(Delhi) గాలి మారుతోంది. గత పదేళ్లుగా చీపురు పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ఓటర్లు.. ఈ సారి మాత్రం బీజేపీ(BJP) వైపు నిలబడ్డట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన ఎన్నికలపై(Delhi elections) విడుదలైన ఎగ్జిట్ పోల్స్(Exist polls) ఫలితాలు.. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Admi Party) పూర్తిగా బలహీనపడకపోయినా.. బీజేపీ మాత్రం చాలా బలంగా ఎదిగిన తీరు.. ఎగ్జిట్ పోల్స్ తో అర్థం అవుతోంది. మరోసారి అధికారాన్ని అందుకుని హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆమ్ ఆద్మీ ఆశలు.. తీరే అవకాశం లేదని ట్రెండ్స్ తేల్చి చెబుతున్నాయి. దాదాపుగా.. ఏ ఎగ్జిట్ పోల్ సర్వే రిజల్ట్ చూసినా.. ఆప్ ఓడిపోబోతోందని.. బీజేపీకి ఢిల్లీ పీఠం దక్కబోతోందని వన్ సైడెడ్ గా రిజల్ట్ కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళి గమనిస్తే.. కాంగ్రెస్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే.. అంత మంచిదని అర్థమవుతోంది.
ఢిల్లీ శాసనసభలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. అందులో.. అధికారానికి కావాల్సిన సంఖ్య 36. ఈ నంబర్ ను బీజేపీ ఈజీగానే సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ చెబుతున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం.. బీజేపీకి 51 నుంచి 60 సీట్లు రానుండగా.. ఆమ్ ఆద్మీకి 19 లోపు సీట్లకే పరిమితం కానుంది. పోల్ డైరీ సర్వే ప్రకారం.. బీజేపీకి 42 నుంచి 50.. ఆమ్ ఆద్మీకి 18 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. పీపుల్స్ ఇన్ సైట్ సర్వే ప్రకారం.. బీజేపీకి 40 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 25 నుంచి 29 సీట్లు వచ్చే చాన్స్ ఉంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే చెప్పిన ప్రకారం.. బీజేపీకి 39 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 25 నుంచి 28 సీట్లు వస్తాయి. జేవీసీ సర్వే ఫలితం ప్రకారం.. బీజేపీకి 39 నుంచి 45.. ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31 స్థానాలు దక్కే చాన్స్ ఉంది. టైమ్స్ నవ్ సర్వే ఫలితం ప్రకారం.. బీజేపీకి 39 నుంచి 45, ఆమ్ ఆద్మీకి 22 నుంచి 31 సీట్లు దక్కే అవకాశం ఉంది. పీమార్క్ సర్వే ఫలితం ప్రకారం బీజేపీకి 39 నుంచి 49, ఆమ్ ఆద్మీకి 21 నుంచి 31 సీట్లు రానున్నాయి. డీవీ రీసెర్చ్ సర్వే ప్రకారం బీజేపీకి 36 నుంచి 44, ఆమ్ ఆద్మీకి 26 నుంచి 34 సీట్లు వచ్చే చాన్స్ ఉంది. మాట్రిజ్ సర్వే ప్రకారం బీజేపీకి 35 నుంచి 40, ఆమ్ ఆద్మీకి 32 నుంచి 37 సీట్లు వచ్చే చాన్స్ ఉంది.