ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi assembly elections) సంచలనం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్(Arvindh Kejriwal), న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా 1200 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. అలాగే, బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో జంగ్‌పురలో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో ప్రముఖ నాయకుడు సత్యేందర్ జైన్ కూడా షాకుర్ బస్తీ నియోజకవర్గంలో ఓడిపోయారు. ఈ ఓటములతో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద కుదుపు తగిలింది.
మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీ(BJP) స్పష్టమైన మెజారిటీ సాధించింది. ప్రజల చూపు కాషాయం వైపు పడినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా పన్ను మినహాయింపులు, ఎన్నికల హామీలు, ఆమ్ ఆద్మీపై ప్రజల వ్యతిరేకత కూడా కలిసి వచ్చింది. ఈ పరిణామాలతో ఆమ్ ఆద్మీని ప్రజలు తిరస్కరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, శీష్ మహల్ వివాదం, అవినీతి, యమునా కాలుష్యం వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. కేజ్రివాల్ మానసపుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్ మరియు ప్రభుత్వ పాఠశాలలు ప్రజలలో మక్కువ కలిగించలేకపోయాయి.
అంతేకాక, బీజేపీ ఆమ్ ఆద్మీపై(AAP) అతి దూకుడుగా ప్రచారం చేసింది. విపక్షాల అనైక్యత కూడా బీజేపీకి అనుకూలంగా మారింది. ఇండియా కూటమి ఓట్ల చీలికతో బీజేపీ లాభపడింది. ఆమ్ ఆద్మీ మరియు కాంగ్రెస్ సమన్వయంతో 50 శాతం ఓట్లు పంచుకున్నా, విడివిడిగా పోటీచేసినందుకు ఆమ్ ఆద్మీ ఓడిపోయింది.










