హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. మృతుల కుటుంబాల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సంఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏసీ కంప్రెసర్ పేలడం మరియు చెక్క ప్యానెల్ల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి.
గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక నగల షాప్ పనిచేస్తుండగా, మొదటి ఫ్లోర్‌లో వ్యాపారి నివసిస్తున్నాడు. వేసవి సెలవుల సందర్భంగా అతని బంధువులు ఇంటికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఆ ఇంటికి ఒకే మెట్ల మార్గం ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. పొగలు ఆవిరై ఇంటిని కమ్మేయడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చివరకు అధికారులు తలుపులు పగలగొట్టి గాయపడినవారిని రక్షించారు.