కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వానికి.. ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. హుబ్బల్లి నుంచి ధార్వాడ్ వెళ్లే మార్గంలో ఉన్న కేశవాపూర్ సర్కిల్ దగ్గర.. సుమారు 3 వేల చదరపు మీటర్ల స్థలాన్ని.. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై.. హై కోర్టు స్టే ఇచ్చింది. కనీసం ఐదున్నర కోట్ల రూపాయల విలువైన ఈ స్థలాన్ని.. కేవలం 28 లక్షల రూపాయలకే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అందజేసేందుకు చేసిన ఈ ప్రయత్నంపై.. బీజేపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. హుబ్బల్లి ధార్వాడ్ పరిధిలో కాంగ్రెస్ కు ప్రభుత్వం కేటాయించిన భూ ప్రతిపాదనపై.. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేపీ నాయకులు సంతోష్ చవాన్, బీరప్ప.. న్యాయ పోరాటానికి దిగారు.
అధిక ధర పలికే భూమిని అధికార పార్టీకి చౌకగా కట్టబెడుతున్నారని వాదించారు. అంతే కాదు.. ఆ స్థలం ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే.. ప్రతిపాదిత స్థలంలో.. హుబ్బల్లి నగరానికి తాగునీటిని సరఫరా చేసే భారీ నీటి ట్యాంకులు ఉంటున్నాయని.. అలాంటి చోటును రాజకీయాలకు వాడడం ఏంటని కోర్టులో వాదించారు. ఇది కచ్చితంగా.. ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించేదే అని స్పష్టం చేశారు. గడచిన ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదించిన ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న బెంచ్.. చివరికి కేబినెట్ నిర్ణయంపై స్టే ఇచ్చింది. ఇది ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు షాక్ ఇవ్వగా.. ప్రతిపక్ష బీజేపీ నేతల్లో జోష్ నింపింది.
ఈ విషయంపై.. కర్ణాటక లా మినిస్టర్ పాటిల్ స్పందించారు. రాజకీయ పార్టీలకు ఇలా తక్కువ ధరకు భూములు కేటాయించడం అన్నది ఇప్పటి విషయం కాదని.. చాలా కాలంగా జరుగుతూనే ఉందని చెప్పుకొచ్చారు. కేబినెట్ నిర్ణయంలో తప్పేమీ లేదని సమర్థించుకునేలా కామెంట్లు చేశారు. గతంలో అమలైన నిర్ణయాల ప్రకారమే.. ప్రస్తుత ప్రభుత్వం కూడా భూములు కేటాయించిందని చెప్పారు. కానీ.. బీజేపీ నాయకులు మాత్రం పాటిల్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. తప్పు చేశారు కాబట్టే.. హై కోర్టు స్టే ఇచ్చిందని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో.. ఎంతవరకైనా న్యాయపోరాటానికి సిద్ధమని కాంగ్రెస్ కు తేల్చి చెబుతున్నారు.
https://youtu.be/MAToKHyCn2w