
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తమ “8వ తెలుగు సంబరాలు” కార్యక్రమాన్ని జూలై 4-6, 2025 వరకు అమెరికాలోని టంపాలో నిర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ అమెరికా నుండి వచ్చి మీడియాతో మాట్లాడారు. నటి జయసుధ, ఆమని, దర్శకులు హరీశ్ శంకర్, మెహర్ రమేష్, సంగీత దర్శకుడు తమన్, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, కళ్యాణ చక్రవర్తి తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ, నాట్స్ 2009లో సేవ మరియు తెలుగు భాష పరిరక్షణ లక్ష్యంతో స్థాపించబడిందని, అమెరికాలోని తెలుగు వారికి అండగా నిలుస్తూ, భాషను భవిష్యత్ తరాలకు అందిస్తోందని చెప్పారు. ఈ ఈవెంట్‌లో 10,000 మంది పాల్గొంటారని, 300 మంది సభ్యులు కమిటీలుగా పనిచేస్తున్నారని, రాబోయే 15 ఏళ్లలో మరిన్ని సేవలను ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. శ్రీనివాస్ గుత్తికొండ తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు నాట్స్ కృషిని ప్రశంసిస్తూ, ఈ సంబరాలను అపూర్వంగా నిర్వహిస్తామని, అందరినీ ఆహ్వానించారు.
జయసుధ నాట్స్‌ను సేవా సంస్థగా కొనియాడి, ఈసారి తప్పక హాజరవుతానని చెప్పారు. తమన్ గతంలో పాల్గొన్న అనుభవాన్ని పంచుకుంటూ, ఈసారి దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి కన్సర్ట్ ఇస్తానని, క్రికెట్ టోర్నమెంట్‌లోనూ ఆడతామని తెలిపారు. హరీశ్ శంకర్, మెహర్ రమేష్ నాట్స్ సేవలను మెచ్చుకున్నారు. చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి భాషా పరిరక్షణలో నాట్స్ పాత్రను ప్రశంసించారు. ఆమని ఈవెంట్‌లో పాల్గొనడానికి సంతోషం వ్యక్తం చేసి, నాట్స్ మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.