భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సమర్థంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు శశిథరూర్ ప్రశంసించారు. ఉగ్రవాదం విషయంలో దాయాది దేశానికి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారన్నారు. సొంత పార్టీలోనే శశిథరూర్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తమైంది. శశిథరూర్ లక్ష్మణ రేఖ దాటారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా శశిథరూర్‌కు, కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే మాట వినిపిస్తోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సమర్థించారు.
యూరప్, మధ్యప్రాచ్యంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొనసాగుతున్న మద్దతును బహిర్గతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ భాగం కానున్నారనే వార్తలను కేరళ కాంగ్రెస్ శుక్రవారం స్వాగతించింది. ఈ పరిణామాలపై స్పందిస్తూ, కేరళ కాంగ్రెస్ X లో పోస్ట్ చేసింది. దేశానికి ప్రపంచ స్థాయిలో విశ్వసనీయ ప్రతినిధి అవసరమని పేర్కొంది. “ప్రధానమంత్రి మోదీ, ఆయన విదేశాంగ మంత్రి అంతర్జాతీయంగా విశ్వసనీయతను కోల్పోయిన సమయంలో, దేశానికి గౌరవం ఇచ్చే స్వరం అవసరం. అందుకే బీజేపీలోని ప్రతిభ శూన్యతను గుర్తించి, దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ నాయకుడిని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము” అని పోస్ట్ చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత , ఉగ్రవాదంలో పాకిస్తాన్ పాత్రను ఎత్తిచూపడానికి ప్రభుత్వం ఒక ప్రధాన దౌత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రపంచ దేశాలకు దుష్ట పాకిస్థాన్ ద్వంద నీతి ఎండ కట్టేందుకు భారత్ ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా భారత్ తరుఫున ప్రతినిధుల బృందాన్ని అయా దేశాలకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.










