
పహల్గామ్, ఆపరేషన్ సింధూర్ ఘటనల తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదుల కార్యకలాపాలపై మరింత అప్రమత్తమైంది. కశ్మీర్ లో జరిగిన ఎన్కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమవడంతో పాటు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉగ్ర సంబంధిత వ్యక్తులను గుర్తించి అరెస్టు చేస్తున్న అధికారులు, వారికి మద్దతిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఉగ్ర అనుమానితుడి అరెస్టు కలకలం రేపుతోంది. కొండాపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 14న అస్సాం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు సమాచారం.
ఇస్లాం కొద్ది కాలంగా గొల్లపల్లిలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. కానీ అస్సాంలో ఉన్నప్పుడు అతను ఓ మొబైల్ షాపులో నకిలీ డాక్యుమెంట్లతో సిమ్ కార్డులు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. ఈ సిమ్ కార్డులను పాకిస్తాన్‌కు విక్రయించిన అనుమానాలు ఉన్నాయి.
అంతేకాకుండా, భారతదేశానికి సంబంధించిన గోప్య సమాచారాన్ని పాక్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్టు విచారణలో తేలింది. “ఆపరేషన్ ఘోస్ట్ సిమ్” పేరిట నడుస్తున్న దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు ఈ ఆపరేషన్‌లో దేశవ్యాప్తంగా ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ చేయగా, వీరందరూ అస్సాం రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. భారత ఫోన్ నెంబర్లను వాడుకుని పాకిస్తాన్‌లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.