సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, రచయిత బి.కె. ఈశ్వర్ (77) బుధవారం రోజున హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడకు చెందిన ఈశ్వర్ గారు, హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుంచి సినిమా పట్ల ప్రగాఢమైన ఆసక్తిని కలిగి ఉండేవారు. ఆ ఆసక్తి మద్రాస్‌కు తీసుకెళ్లింది, అక్కడ విజయచిత్ర పత్రికలో రెండు దశాబ్దాలపాటు ఉప సంపాదకునిగా సేవలందించారు. పూణె ఫిల్మ్ & టీవీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు కూడా చేశారు.
1998 నుండి 2002 మధ్య కాలంలో ఈటీవీలో స్టోరీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పని చేశారు. ఈటీవీ, తేజ టీవీలకు పలు సీరియల్స్ రాయగా, వాటిలో కొన్ని నంది అవార్డులు కూడా సాధించాయి. ఆయన ‘హృదయాంజలి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘చీకటిలో నేను’, ‘అజయ్ పాసయ్యాడు’, ‘నేను – ఆది – మధ్యలో మా నాన్న’ వంటి చిత్రాలకు మాటలు, పాటలు అందించారు.
ఆంధ్రజ్యోతి ప్రచురించే నవ్య వీక్లీలో “అనగా అనగా ఒకసారి” శీర్షికతో 62 వారాల పాటు వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు విజయచిత్ర జ్ఞాపకాలు పేరుతో పుస్తకంగా వచ్చాయి. అంతేకాక, ఇతర పత్రికల్లో రాసిన వ్యాసాలతో “ఈ దారి ఎక్కడికి?” అనే గ్రంథాన్ని కూడా తీసుకొచ్చారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా పలువురు, సంస్థలు ఘనంగా సత్కరించాయి. సూపర్ మూవీస్ అడ్డా అనే పేరుతో యూ ట్యూబ్ ఛానెల్‌ను కూడా నడిపారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ గారు మే 14న తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మే 15న జూబ్లీహిల్స్ శ్మశానవాటికలో నిర్వహించబడ్డాయి. ఆయన కుమారుడు ప్రేమ్ చంద్ కూడా దర్శకుడిగా పలు చిత్రాలను రూపొందించారు.
ఈశ్వర్ గారితో నాకు ఉన్న అనుబంధం ఎంతో అద్భుతమైనది. సినిమాలపై, దేశంపై ఆయనతో ఎన్నో చర్చలు జరిగాయి. ఎన్నో పాటలు ఆయన రాయగా, నన్ను కూడాను పలు రచనలకోసం ప్రోత్సహించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, నిజాయితీ గల పాత్రికేయుడు. ఇటువంటి మహనీయుడిని కోల్పోవడం బాధాకరం. ఇటీవల బెంగళూరుకు వెళ్లిన కారణంగా చివరిసారి ఆయనను చూసే అవకాశం కూడా నాకు దక్కలేదు – ఇది నా జీవితంలో ఓ తీరని లోటు.