గురువారం జలసౌధలో కృష్ణా జలాల పంపిణీపై కీలక సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల సెక్రటరీలు, ఈఎన్సీలు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. అసలు ఈ సమావేశం బుధవారమే జరగాల్సి ఉండగా, ఏపీ అధికారులు హాజరుకాకపోవడంతో గురువారానికి వాయిదా పడింది.
తెలంగాణ తరఫున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఏపీ తరఫున స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీలు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీ 55 టీఎంసీలు కోరగా, బోర్డు ఈ విభజనపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఏపీకి అసలు వాటా 23 టీఎంసీలే కాగా, ప్రస్తుతం 16 టీఎంసీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలంగాణ స్పష్టం చేసింది. తమకు ఇంకా 130 టీఎంసీలు రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది.