నాగర్ కర్నూల్(Nagar kurnool) జిల్లా ఆమ్రబాద్ మండల పరిధిలోని దోమలపెంటలో ఉన్న SLBC సొరంగంలో(SLBC Tunnel).. పైకప్పు కూలిపోయి 13 రోజులు దాటింది. అప్పటి నుంచి ఈ క్షణం వరకు అధికారులు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతూనే ఉన్నారు. సింగరేణి రెస్క్యూ బృందం(Singareni rescue team).. ఎన్డీఆర్ఎఫ్.. ఆర్మీ.. నేవీ.. హైడ్రా.. ర్యాట్ హోల్ మైన్స్.. ఇలా రకరకాల విభాగాలకు చెందిన నిపుణులు.. రాత్రింబవళ్లూ పని చేస్తూనే ఉన్నారు. ఆచూకీ లేకుండా పోయిన 8 మందిలో నలుగురి ఆనవాళ్లు గుర్తించామన్న ప్రకటనతో.. సస్పెన్స్ కు తెర పడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి వెళ్లిన తర్వాత కూడా.. పరిస్థితిలో ఏ మార్పు రాలేదు.
ఈ తరుణంలో.. ప్రభుత్వ దృష్టి.. కేరళకు చెందిన కడవర్ జాగిలాలపై పడింది. ఇలాంటి అనుకోని విపత్తుల్లో ఆచూకీ లేకుండాపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకు కడవర్ జాగిలాలు ప్రత్యేక శిక్షణ పొంది ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అందుకే.. వాటిని SLBC లోకి పంపిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టారు. ప్రత్యేక విమానంలో.. కేరళ నుంచి 2 కడవర్ జాగిలాలను ప్రమాద స్థలికి చేర్చారు. వాటిని లోపలికి పంపితే.. తర్వాత ఆ జాగిలాలు ఇచ్చే స్పందనను బట్టి.. గల్లంతైన ఆ 8 మంది ఆచూకీ ఏమైనా గుర్తించవచ్చేమో అని అధికారులు ప్రయత్నాలు చేసేందుకు సిద్ధమయ్యారు.