ఆస్తుల కోసం.. తల్లి విజయమ్మ(Vijayamma), చెల్లి షర్మిలపై(YS Sharmila) పోరాటానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan). తనకు సంబంధించిన షేర్లను.. విజయమ్మ, షర్మిల ఇద్దరూ కలిసి అక్రమంగా తమ పేరు మీదకు బదలాయించుకున్నారని ఆరోపిస్తూ.. హైదరాబాద్ లో ఉన్న జాతీయ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ, షర్మిలతోపాటు.. సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరోవైపు.. గత వారం కూడా జగన్ మధ్యంతర పిటిషన్ వేశారు. బదిలీ అయిన షేర్లపై స్టే విధించాలని అందులో కోరారు.
మధ్యంతర పిటిషన్ తో పాటు.. తాజా పిటిషన్ పై ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా.. అందుకు ట్రైబ్యునల్ సమ్మతించింది. వచ్చే నెల 3 కు విచారణను వాయిదా వేసింది. ఈ లోగా.. జగన్ పై తమ పోరాటాన్ని విజయమ్మ, షర్మిల మరింత తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై.. జగన్, షర్మిల, విజయమ్మ మధ్య గొడవ నడుస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కూడా లీగల్ వ్యవహారాల్లోకి లాగుతున్నారంటూ.. జగన్ తీరుపై రాజకీయ ప్రత్యర్థి పక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. కానీ.. అదేదీ పట్టని జగన్ మాత్రం.. కుటుంబ సభ్యులతో సయోధ్యకు ప్రయత్నం చేయకుండా.. న్యాయ పోరాటానికే సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుని.. ఇప్పటికే మధ్యంతర పిటిషన్ వేయడమే కాక.. తాజాగా మరో పిటిషన్ కూడా వేసి.. తల్లితో, చెల్లితో లీగల్ ఫైట్ చేసి తేల్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం.. రాజకీయంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తోంది.