రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections).. 2 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ(BJP).. సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. తెలంగాణలో తామే కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్కు(BRS) ప్రత్యామ్నాయమని ఈ ఫలితాలు నిరూపించినట్టు.. కమలం నేతలు చెబుతున్నారు. ఈ గెలుపుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా అభినందనలు తెలపడంతో.. పార్టీ నేతలు మండలి ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకున్నారన్నది అర్థమవుతోంది. అనుకున్నట్టుగానే ప్లాన్ ఫలించి.. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో మల్క కొమురయ్యతో పాటు.. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానంలో అంజిరెడ్డి బీజేపీ మద్దతుతో ఘన విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న స్థానాల్లో.. ఏకంగా 20కి పైగా ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీల బలం ఉన్న ప్రాంతంలో.. తమ అభ్యర్థిని గెలిపించుకున్న బీజేపీ.. తన బలాన్ని మాత్రమే కాదు.. ఉనికిని కూడా అమాంతం పెంచుకుందని స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీకి దక్కిన ఈ బలంతో.. తెలంగాణ రాజకీయ వేదికపై ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
కాస్త లోతుగా ఆలోచిస్తే.. ఈ పరిణామం అటు తిరిగి ఇటు తిరిగి ప్రతిపక్ష బీఆర్ఎస్ కే మేలు చేసేదిగా కనిపిస్తోంది. ఎందుకంటే.. బీజేపీ ఇప్పటికిప్పుడు బలపడడం వల్ల.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కే భారీ నష్టం కలుగుతుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట బీజేపీ పుంజుకోవడం అంటే.. అది అధికార పార్టీనే బలహీనమవుతున్నట్టు తప్ప.. మరోటి కాదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు దక్కిన సీట్లు సున్నా.