తెలంగాణలో.. మంత్రి వర్గ విస్తరణ అన్నది అందని ద్రాక్ష అన్నట్టే మారిపోయింది. రేవంత్ ప్రభుత్వం(Revanth government) ఏర్పడి 16 నెలలు దాటిపోతున్నా కూడా.. ఇప్పటికీ అధికారంలోకి వచ్చినప్పటి మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది. అలాగే.. చాలాసార్లు కేబినెట్ విస్తరణ అంటూ ఊహాగానాలు చక్కర్లు కొట్టినా.. అది అధిష్టానం దగ్గర పెండింగ్ లోనే ఉండిపోయి.. అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఈ కాలయాపనతో.. పార్టీలో ఆశావహుల జాబితా పెరుగుతోంది. నాకు కావాలంటే.. నాకు కావాలంటూ మంత్రి పదవి కోసం ఓ సీనియర్ సై అంటే సై అంటున్నారు. పార్టీలో చేరినప్పుడే నాకు హామీ ఉందని.. ఆ హామీ తీర్చకుంటే ఎలా అని మరో సీనియర్ నాయకుడు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఆ ఇద్దరూ అన్నదమ్ములు. ఒకే జిల్లా పరిధిలో పని చేస్తున్న నాయకులు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా.. తనకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చి చెబుతున్నారట.
ఇలా.. పార్టీ నాయకత్వం కాలయాపన చేస్తున్న కారణంగా నేతల మధ్య కూడా అంతరాలు పెరుగుతున్నాయి. ఆశావహుల్లో ఆరాటం పెరుగుతోంది. అసంతృప్తుల్లో నిరుత్సాహం ఎక్కువవుతోంది. మరోవైపు.. రాజకీయంగా ఎన్నో సవాళ్లు రానున్న రోజుల్లో పార్టీ ఎదుర్కోవాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad), గ్రేటర్ వరంగల్(Greater Warangal) వంటి ప్రతిష్టాత్మక సమరాలు ఎదురు కానున్నాయి. ఇంతటి తీవ్రమైన రాజకీయ పోరాటం ముందున్న తరుణంలో.. కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇంత పట్టుదలకు పోతోంది అన్నది.. పార్టీ నేతలకు కూడా ఏ మాత్రం మింగుడుపడడం లేదు. ఏడాదిన్నర కావొస్తున్నా.. మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్నది సీనియర్లు కూడా అంచనా వేయలేకపోతున్నారు. కనీసం.. ఎవరిపైనా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్న హై కమాండ్.. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ను ఏం చేయాలని భావిస్తోందన్నది అంతుబట్టక.. సాధారణ కార్యకర్తల్లో రోజురోజుకూ టెన్షన్ పెరుగుతోంది.
ఇలాంటి పరిస్థితినే.. పార్టీలో కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా.. ఉత్తర తెలంగాణకు(North Telangana) చెందిన ఓ జిల్లాలో అయితే.. ఇంతకుముందు చెప్పినట్టుగా ముగ్గురు సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు. వారిలో ఇద్దరు అన్నాదమ్ములు. అందులో ఒకరు.. ఇంతకుముందే వైఎస్ కేబినెట్ (YS cabinet) లో మంత్రిగా పని చేశారు. మరో నాయకుడు.. ఢిల్లీలో కూడా లాబీయింగ్ చేయగలిగేంత పలుకుబడి ఉన్నా నాయకుడు. ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా.. వారి జిల్లాలో కుటుంబం పెత్తనం పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. అందుకే.. అన్నాదమ్ములిద్దరికీ పదవి రాకుండా ఓ సీనియర్ మంత్రి అడ్డుపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వారి బదులుగా.. అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, పదవి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాయకుడికి కేబినెట్ బెర్త్ ఇప్పించాలని ఆ సీనియర్ మంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.
ఓవరాల్ గా.. కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. ఈ ముగ్గురిలో ఎవరికి పదవి రాకున్నా.. చివరికి ఇబ్బంద పడాల్సింది కాంగ్రెస్ పార్టీనే అన్నది.. ఆ జిల్లా కార్యకర్తల మధ్య రోజురోజుకూ చర్చ పెరుగుతోంది. ఇదే.. వారిలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళనకు కారణం అవుతోంది. పార్టీ హై కమాండ్ కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ.. ఈ వీషయంలో సీరియస్ గా స్పందించి పదవుల లెక్కలు పూర్తి చేస్తే తప్ప.. ఈ ఆందోళనకర పరిస్థితికి ఫుల్ స్టాప్ పడేలా లేదు.










