
తెలంగాణ(Telangana) ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం(ajiv Yuva Vikasam Loans) పథకం ద్వారా రాష్ట్రంలోని యువతకు(Youth) ఆర్థికంగా బలాన్నివ్వాలనే లక్ష్యంతో రుణాల మంజూరు కార్యక్రమం చేపట్టనుంది. అయితే ఈ పథకం కింద లోన్ పొందాలనుకునే అభ్యర్థులకు సిబిల్ స్కోర్(CIBIL Score) కీలక అర్హత ప్రమాణంగా ఉండబోతోంది. దరఖాస్తుదారులు గతంలో తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోతే, లేదా వారి క్రెడిట్ స్కోర్(Credit score) తక్కువగా ఉంటే, బ్యాంకులు వారి దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.
క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించేందుకు బ్యాంకులు దరఖాస్తుదారుల నుండి సిబిల్ స్కోర్ ఫీజు వసూలు చేయనున్నాయి. ఈ ఫీజు రూ.100 నుంచి రూ.200 మధ్య ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు(Bank) ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. అయితే తక్కువ ఆదాయ వర్గాల అభ్యర్థులపై ఈ ఫీజు భారం పడకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. బ్యాంకులు వసూలు చేసే ఈ ఫీజును మినహాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నివేదించనున్నారు. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.
రాజీవ్ యువ వికాసం పథకానికి రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. మొత్తం 16,25,441 దరఖాస్తులు అందాయి. వీటిలో బీసీ అభ్యర్థులు 5,35,666, ఎస్సీలు(SC) 2,95,908, ఎస్టీలు 1,39,112, బీసీలు(BC) 23,269, ముస్లిం మైనారిటీలు(Minority) 1,07,681, క్రిస్టియన్ మైనారిటీలు 2,689 మంది ఉన్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో దాదాపు 70 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు అధికారులు తెలిపారు. అర్హులుగా గుర్తించిన దరఖాస్తులను బ్యాంకులకు పంపించి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. తుది జాబితా మే నెలాఖరులో విడుదల చేసి, అదే జాబితాను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి అందజేస్తారు. ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతగా సుమారు 5 లక్షల లబ్దిదారులకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.