
కొంతమంది మంచి ఉద్యోగ అవకాశాల కోసం లేదా అధిక జీతం ఆశతో ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంటారు. వారు ముందుగానే ప్లాన్ చేసుకొని, అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని రిజైన్ చేస్తారు. మరికొందరు ఆఫీసులో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, కోపంతో వెంటనే నిర్ణయం తీసుకుని ఉద్యోగం మానేస్తారు. ఏ మాత్రం ఆలోచించకుండా తీసుకునే ఈ రకమైన నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారి తీసే అవకాశముంది. కాబట్టి ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం మంచిది.
కొన్ని సంస్థలు ఉద్యోగుల నుంచి బాండ్‌పై సంతకం చేయిస్తాయి. మీరు ఉద్యోగంలో చేరినప్పుడు ఆ సంస్థ ఇచ్చిన ఒప్పంద పత్రాన్ని (బాండ్‌ను) చదవండి. అందులో పేర్కొన్న నిబంధనలను గమనించి, వాటిని అనుసరించి రాజీనామా చేయండి. లేదంటే, సంస్థతో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.
మీరు పొందిన కొత్త ఉద్యోగ ఆఫర్ ప్రకారం, మరియు అక్కడి జాయినింగ్ డేట్ ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయండి. జాయినింగ్ లెటర్ లేకుండానే ఉద్యోగం మానేస్తే, మధ్యలో ఖాళీ సమయంలో ఆదాయ మార్గం లేక ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే కొంత సమయం తీసుకుని ఆలోచించి ముందుకు సాగండి.
అలాగే, రాజీనామా చేసేటప్పుడు సెలవులను గమనించండి. నోటీస్ పీరియడ్‌లో సెలవులు తీసుకోవడం సాధ్యపడదు. కాబట్టి మీ సెలవులు వృథా కాకుండా ఉండాలంటే, వాటిని ముందుగానే వినియోగించి ఆ తరువాత రాజీనామా చేయడం మంచిది.