
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణిని ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె వందలాది సినిమాల్లో సహాయ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం మాత్రం ఆమె సినిమాల్లో బిజీగా లేరు. ఇదిలా ఉండగా, ఆమె కూతురు సుప్రిత వెండితెరపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సుప్రిత, త్వరలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ సినిమాల్లో “లేచింది మహిళా లోకం” ఒకటి కాగా, మరోటి బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్‌తో కలిసి నటిస్తున్న చిత్రం. ఈ రెండూ ఈ ఏడాది థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే “అమరావతికి ఆహ్వానం” అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో కూడా సుప్రిత నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాల చిత్రీకరణతో సుప్రిత బిజీగా ఉంది.
అయితే, అకస్మాత్తుగా సుప్రిత అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆస్పత్రి బెడ్‌పై సెలైన్ తీసుకుంటున్న ఫొటోలను పంచుకుంటూ, “దిష్టి నిజమే. ఈ వారం జీవితం ఎలా ఉంటుందో బాగా తెలుసుకొన్నాను. శివయ్యను నేను నమ్ముతాను. ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య, అమ్మ, ప్రసన్న, రమణ లేనిదే నేను లేను. జీవితం నన్ను మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తోంది. దిష్టి నా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఈ రోజుల్లో బాగా అర్థమవుతోంది” అంటూ భావోద్వేగంగా వెల్లడించింది.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చురుకుగా కనిపించే సుప్రితను ఆస్పత్రిలో చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.