అనుకున్నట్టే అయ్యింది. కుల గణన(Cast census) వ్యవహారం.. స్థానిక సంస్థల ఎన్నికలపై(Local body ELections) ప్రభావం చూపిస్తోంది. కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారం.. లోకల్ ఫైట్ డిలే కావడానికి కారణమవుతోంది. ఈనెల 15లోపే.. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంతా అనుకున్నారు. మరో 2, 3 రోజుల్లోనే ఎన్నికల వాతావరణం రాష్ట్రమంతా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని స్థానికులు కూడా చర్చించుకున్నారు. కానీ.. ఇప్పట్లో తెలంగాణలో(Telangana) స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం.. అనుమానమే అన్న అభిప్రాయం తాజాగా.. కాస్త బలంగా వినిపిస్తోంది. కులగణన లెక్కలపై వెల్లువెత్తుతున్న విమర్శలతో.. రేవంత్(Revanth reddy) ప్రభుత్వం పునరాలోచనలో పడింది. మరోసారి కులగణన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సమరం ఉంటుందని వార్తలు కాస్త బలంగానే వినిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కులగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు.. లెక్కలతో సహా వివరించింది. లక్షకు పైగా సిబ్బంది పాల్గొని జనాభా లెక్కలు తేల్చారు. మూడున్నర కోట్ల మంది జనాభా.. తమ వివరాలు అందించారు. మరో 16 లక్షల మంది రకరకాల కారణాలతో తమ వివరాలు అందించలేదు. కానీ.. కులగణన తర్వాత.. ప్రభుత్వం తెలిపిన బీసీల జనాభా లెక్కల వివరాలపై విపక్షాలతో పాటు.. బీసీ వర్గాలకు చెందిన నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే.. ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలో పడేసింది. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొచ్చింది. ఇది కూడా ప్రభుత్వానికి కొత్త సవాళ్లను తీసుకొచ్చింది. అందుకే.. ఈ సమస్యను అధిగమించేందుకు.. విమర్శలకు చెక్ పెట్టేందుకు.. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనెల 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన చేసి.. పూర్తి వివరాలను ప్రజల ముందు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బిల్లును ఆమోదింపజేసి.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళ్లాని ఆలోచిస్తోందని సమాచారం అందుతోంది.