తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి నటుడిగా ఎదిగి.. సినిమాల్లో లోక నాయకుడిగా కీర్తిని ఆర్జించిన కమల్ హాసన్(Kamal Haasan).. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బాటలో నడుస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి.. అధికారాన్ని సొంతం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి.. పూర్తిగా విఫలమైన కమల్.. తన పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీని(Makkal Needi Maiam Party) ఇప్పుడు తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో(DMK) విలీనం చేయబోతున్నారు. ఇందుకు బహుమానంగా.. డీఎంకే నాయకత్వం.. కమల్ హాసన్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని బహుమతిగా ఇవ్వనుంది. ఇదంతా చూస్తుంటే.. ప్రజారాజ్యాన్ని స్థాపించిన చిరంజీవి.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్(Congress) లో తన పార్టీని విలీనం చేసి.. రాజ్యసభ సభ్యత్వాన్ని పొందినట్టుగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి.. చిరంజీవి బాటలో కమల్ హాసన్ నడుస్తున్నట్టుగా ఉందని అంటున్నారు. రాజకీయాల్లో విఫలమైన పరిస్థితుల్లో.. తన గౌరవాన్ని కాపాడుకోవాలంటే.. కమల్ కు ఇంతకు మించిన అవకాశం మరోటి లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.
డీఎంకే తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్న కమల్ హాసన్.. ఇకపై దేశ రాజకీయాల్లో ప్రభావాన్ని చూపించబోతున్నారు. తమిళనాడు తరఫున తన వాణిని, బాణిని కాస్త గట్టిగా వినిపించబోతున్నారు. ప్రస్తుతం డీఎంకే.. కేంద్రంలో విపక్షాల కూటమి అయిన ఇండియా అలయన్స్ తో కలిసి అడుగులు వేస్తోంది. బీజేపీ భావజాలానికి పూర్తి విరుద్ధమైన ఐడియాలజీ కావడంతో.. డీఎంకే ఆ పార్టీకి దూరంగా రాజకీయాలు చేస్తోంది. తమిళనాడులో ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఆశలకు.. డీఎంకేనే గట్టిగా అడ్డంకిగా నిలుస్తోంది. కాబట్టి.. కేంద్రంలో అధికార కూటమితో ఏ మాత్రం సంబంధం లేకుండా.. కమల్ హాసన్ తన రాజకీయాన్ని కొనసాగించనున్నారు. భవిష్యత్తులో బీజేపీ కూటమి కాకుండా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. అప్పుడు కూడా డీఎంకే పార్టీ.. బీజేపీ ప్రత్యర్థి కూటమితోనే కలిసి నడిస్తే.. అప్పుడు కమల్ హాసన్ కచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని అనలిస్టులు భావిస్తున్నారు.
Watch Video For More Deatils–>
https://youtu.be/eKndlFv7Kbw