
భారతదేశంలో రోడ్డుప్రమాద(Road accident) బాధితులకు మే 5, 2025 నుంచి నగదు రహిత వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. రోడ్డుప్రమాదాల సమయంలో బాధితులు సరైన సమయంలో చికిత్స పొందకపోవడంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం(Center Government) కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా నోటిఫై చేసిన ఆసుపత్రుల్లో రోడ్డుప్రమాదానికి గురైన బాధితులు ప్రమాదం జరిగిన రోజునుంచి ఏడు రోజుల వరకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం పొందగలరు.
ఈ పథకాన్ని అమలు చేసే బాధ్యత జాతీయ ఆరోగ్య సంస్థ (NHA)కు ఇవ్వబడింది. పోలీస్ శాఖ, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థల సమన్వయంతో సేవలు అందించనున్నారు. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ప్రతి రాష్ట్రంలో ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఆసుపత్రులను పథకంలోకి తీసుకోవడం, బాధితులకు చికిత్స అందించడం, చెల్లింపుల ప్రక్రియలను పర్యవేక్షించడం వంటివి ఈ మండలుల బాధ్యతగా ఉంటుంది.
ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికై రోడ్ సెక్రటరీ నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 2023లో నమోదైన 4.80 లక్షల రోడ్డుప్రమాదాలలో 1.72 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ పథకం తీసుకువచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.