హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట(Chandrayangutta) దగ్గర ఉన్న షాహీనగర్ లో ఉండే అమీన్ అహ్మద్ అన్సారీ (Amin Ahmed Ansari).. ఆర్టీసీలో కండక్టర్ గా పని చేస్తున్నాడు. అతని ఎత్తు 7 అడుగులు. బస్సులో విధుల్లో ఉన్న సమయంలో.. అంత ఎత్తుతో చాలా ఇబ్బందులు పడుతూ విధులు పూర్తి చేస్తున్నాడు. సుమారు నాలుగైదు ట్రిప్పులు చేయాల్సి వచ్చినప్పుడు.. 10 గంటల పాటు బస్సులో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. బస్సులో తల ఓ వైపు వంచుతూ.. తల చాలా సమయాల్లో కిందకి దించుతూ పని చేస్తున్నాడు ఫలితంగా.. మెడ నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో తరచుగా అనారోగ్యం బారిన పడుతున్నాడు. ఈ విషయం రీసెంట్ గా రెగ్యులర్ మీడియాతో పాటు.. సోషల్ మీడియాలోనూ (social media) హైలైట్ అయ్యింది.
అన్సారీ ఇబ్బంది పడుతున్న సంగతి.. అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) వరకూ వెళ్లింది. తక్షణమే స్పందించిన ఆయన.. అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగాన్ని ఇచ్చేలా చూడాలని సంస్థ ఎండీ సజ్జనార్ కు సూచించారు. సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కూడా.. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్ట్ చేశాడు. ముఖ్యమంత్రి సూచన మేరకు అన్సారీకి ఆర్టీసీలోనే మరో ఉద్యోగాన్ని ఇవ్వగలరు.. అంటూ సజ్జనార్ ను ఆదేశించారు. ఇప్పటికే తండ్రి చనిపోయిన పరిస్థితిలో.. అతని ఉద్యోగాన్ని అన్సారీ పొందారు. అర్హత ఇంటర్మీడియట్. వీటి ఆధారంగా.. అన్సారీకి అవకాశాన్ని కల్పించేందుకు సజ్జనార్ కూడా.. అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
రాజకీయంగా.. ఎంతటి వాడీ వేడీ కామెంట్లు చేసుకుంటున్నవారైనా సరే.. ఒక్కోసారి తమలోని మంచి మనిషిని ఇలా బయటపెడుతుంటారు. అందరి ప్రశంసలు అందకుంటూ ఉంటారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. ప్రత్యర్థి పక్షాలపై ఎంతగా విరుచుకుపడతారో తెలుసు. శాసనసభ, శాసనమండలిలో ఎంతటి ఆవేశంతో మాట్లాడుతారో మరీ తెలుసు. అలాంటి దూకుడు స్వభావం కలిగిన రేవంత్ రెడ్డి.. ఇలా అన్సారీ వంటి ఓ సామాన్యుడి విషయంలో.. సమస్య తెలియగానే స్పందించిన తీరుకు ప్రశంసలు అందుకుంటున్నారు. రేవంత్ మంచితనమే.. ఆయన రాజకీయ భవిష్యత్తుకు శ్రీరామరక్ష అని అభిమానులంతా ఆశీర్వదిస్తున్నారు.










