డీకే శివకుమార్(DK shivakumar).. కర్ణాటక ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అతి త్వరలో ఆయన ఆ రాష్ట్ర సీఎం కాబోతున్నారు. కర్ణాటకతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీని ఆయనే అధికారంలోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయిలోనూ పార్టీకి కష్టకాలంలో తోడుగా ఉన్నారు. సమర్థమైన నాయకత్వాన్ని అందించారు. అలాంటి నేత.. త్వరలోనే కర్ణాటక సీఎం కావడం ఖాయం.. అంటూ పార్టీ సీనియర్ నేత, అధిష్టానానికి నమ్మిన బంటు అయిన వీరప్ప మొయిలీ చేసిన కామెంట్లు.. ఇప్పుడు కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డీకే.. సీఎం కావడం ఖాయమంటూ ఆయన చెప్పడం.. సిద్దరామయ్య సీటుకు ఎసరు తప్పదన్న అభిప్రాయాలకు బలం చేకూరుతోంది.
కర్ణాటకలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే.. వీరప్ప మొయిలీ ఈ కామెంట్లు చేసినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి.. తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంపై డీకీ శివకుమార్ అసంతృప్తిగా ఉన్నారు. ఎవరికీ సాధ్యం కాని వ్యూహాలను అమలు చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది తానే అని ఆయన బలంగా నమ్ముతున్నారు.