
పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Attack) నేపథ్యంలో, పాకిస్థాన్‌పై(Pakistan) భారత్ ప్రతీకార చర్యలు చేపట్టే అవకాశం ఉన్నందున, కేంద్ర హోం శాఖ సూచనల మేరకు దేశవ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. వాటిలో భాగంగా ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించేందుకు మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరం విశాఖపట్టణంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ బుధవారం సాయంత్రం విశాఖపట్టణ పరిధిలోని క్వీన్ మేరీ పాఠశాల వద్ద ఈ డ్రిల్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యుద్ధ వాతావరణాన్ని తలపించేలా సైరన్లు(Siren), విద్యుత్ నిలిపివేత(Current supply), ప్రజల తాత్కాలిక బదిలీ వంటి చర్యలు చేపడతారు.
ఈ డ్రీల్ ద్వారా ప్రజల్లో అప్రమత్తత పెంచడం, వారు ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రిల్ విజయవంతంగా పూర్తవ్వాలంటే ఏయే విధానాలు పాటించాలన్నదానిపై వివరాలు ఇచ్చారు.
వైమానిక దాడుల హెచ్చరికల సమయంలో స్పందన ఎలా ఉండాలి, విద్యుత్ బ్లాక్ అవుట్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం అవసరమైన వస్తువులు ఇంట్లో ఎలా సిద్ధం చేసుకోవాలి వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించనున్నారు.