మొదటిసారి ఒక మహిళా యాంకర్ ద్వారా టీజర్ ఆవిష్కరణ
కొన్ని సినిమాలు పెద్దగా హడావుడి లేకుండా మొదలై, షూటింగ్ పూర్తయ్యాక ప్రచారంలో వినూత్నమైన పంథాను అవలంబిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలాంటి చిత్రాల సరసన చేరే సినిమా “లోపలికి రా చెప్తా”(Lopalaki ra cheptha). ప్రచార విషయంలో కొత్త ఒరవడిని సృష్టిస్తూ, కాన్సెప్ట్ ఆధారిత చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.
మాస్ బంక్ మూవీస్ బ్యానర్‌పై కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హర్రర్(Horror) ఆధారిత కామెడీ ఎంటర్‌టైనర్‌ను లక్ష్మీ గణేష్ మరియు వెంకట రాజేంద్ర కలిసి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ యాంకర్ అంజలి(Anchor anjali) ఈ రోజు విడుదల చేశారు. ఒక మహిళా యాంకర్ ద్వారా టీజర్ విడుదల కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ, “లోపలికి వస్తే చెప్తా అనే సాంప్రదాయబద్ధమైన టీజర్‌ను నా చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా భార్యాభర్తలు కలిసి చూడదగిన చిత్రం. యువతతో పాటు కుటుంబ సమేతంగా చూసేందుకు అనువైన సినిమా అని నేను హామీ ఇస్తున్నాను” అని తెలిపారు.
చిత్ర దర్శకుడు వెంకట రాజేంద్ర మాట్లాడుతూ, “మంచి మనసుతో సీనియర్ జర్నలిస్ట్ అంజలి గారు మా టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ‘లోపలికి రా చెప్తా’ సినిమా ఉంటుంది. త్వరలో ఒక మంచి తేదీన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని” చెప్పారు.