ZEE5 కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అయ్యనా మానే’ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇప్పటికే IMDbలో 8.6 రేటింగ్ సాధించి, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విపరీతంగా విజయం సాధించిన ఈ థ్రిల్లర్ సిరీస్, మే 16, 2025 నుంచి తెలుగు ఆడియెన్స్ కోసం స్ట్రీమింగ్ కానుంది.
రమేష్ ఇందిర దర్శకత్వం వహించిన ఈ సీరీస్‌లో ఖుషి రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలు పోషించారు. చిక్ మంగళూర్ ప్రాంతాన్ని నేపథ్యంలో తీసుకున్న ఈ కథ, మూడు కోడళ్ల అనుమానాస్పద మరణాల చుట్టూ తిరుగుతుంది. ఆ మరణాలన్నీ దేవత కొండయ్య శాపం వలన జరిగాయన్న నమ్మకంతో గ్రామస్థులు గడపగడపకూ భయపడుతుంటారు.
జాజీ (ఖుషి రవి) అత్తింటికి వచ్చాక, ఆ ఇంట్లో దాగిన అంధకారాన్ని గుర్తించి, తాయవ్వ అనే పనిమనిషి మరియు ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ మహానేష్ సాయంతో మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. కథ మొత్తం సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ అంశాలతో నిండి ఉంటుంది.
ఖుషి రవి మాట్లాడుతూ – “ఇలాంటి కథలో భాగమవ్వడం గర్వంగా ఉంది. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, చాలావరకు సవాలుతో కూడినదిగా ఉంటుంది. ZEE5 మరియు శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సిరీస్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో పెద్ద విజయం సాధించిన మా సిరీస్ ఇప్పుడు మరింత విస్తృతంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకోబోతుంది” అని పేర్కొన్నారు.










