ప్రధాని మోదీ అమరావతి పర్యటన ప్రారంభంలో ఉత్సాహంగా జరిగినా.. చివరిలో తీవ్ర ఉత్కంఠను కలిగించింది. భద్రతా సిబ్బందిని టెన్షన్ పెట్టింది. వాతావరణ సమస్యలు ఇందుకు కారణంగా నిలిచాయి. సభ పూర్తయిన అనంతరం ప్రధాని మోదీ తిరుగు ప్రయాణం.. అనుకున్న సమయం కంటే గంటపాటు ఆలస్యమైంది. అప్పటికే వెలుతురు దాదాపుగా తగ్గిపోయిన పరిస్థితుల్లో.. హెలికాప్టర్ టేక్ ఆఫ్ మంచిది కాదని ప్రధాని భద్రతా సిబ్బంది భావించారు. అవసరమైతే.. ప్రధాని మోదీని రోడ్డు మార్గంలో విజయవాడ విమానాశ్రయానికి తరలించి.. అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లాలని అప్పటికప్పుడు ప్లాన్ చేశారు. ఈ పరిస్థితులు స్పెషల్ ప్రొటెక్షన్ బలగాలతో పాటు.. ఏపీ పోలీసు వర్గాలను, అధికార యంత్రాంగాన్ని పెన్షన్ పెట్టించాయి.
వాస్తవానికి సభ సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు పూర్తి కావాల్సి ఉంది. కానీ నాయకుల సుదీర్ఘ ప్రసంగాల కారణంగా.. గంటపాటు సభ కొనసాగింది. ఆ తర్వాత భద్రత సిబ్బంది అభ్యంతరాలతో.. ప్రధాని రిటర్న్ జర్నీ కాస్త ఆలస్యమైంది. అయితే సభా ప్రాంగణం నుంచి ఐదు గంటల 45 నిమిషాలకు ప్రధాని కాన్వాయ్ బయలుదేరగా.. సరిగ్గా ఏడు నిమిషాల్లో అంటే ఐదు గంటల 52 నిమిషాలకు హెలీ ప్యాడ్ కు చేరుకుంది. ఆ వెంటనే మరో 5 నిమిషాల్లో.. అంటే ఐదు గంటల 57 నిమిషాలకు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రధాని హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యింది. దిల్లీకి ప్రధాని క్షేమంగా చేరుకున్నారు. దీంతో.. భద్రత సిబ్బందితోపాటు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక సభలో ప్రధాని మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో(Chief Minister Chandrababu) పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తో సరదాగా మాట్లాడారు. తన ప్రసంగంలో అమరావతి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అద్భుతమైన కల సాకారం అవుతుందన్నట్టుగా తనకు అనిపిస్తోందని చెప్పారు. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి.. కేంద్రం పూర్తిగా సహకారాన్ని అందిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం సభకు హాజరైన ప్రతి నాయకుడితో, నాయకురాలితో మాట్లాడి.. వారిని కూడా ఉత్సాహపరిచారు. చివరిలో మోదీ తిరుగు ప్రయాణం కాస్త ఉత్కంఠ కలిగించినా.. ఆయన క్షేమంగా దిల్లీకి చేరుకున్న తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఉన్నతాధికారుల వరకు.. ప్రతి ఒక్కరు సంతోషించారు.