ఏ వేదికపై అయినా సరే.. ప్రధాని మోదీ(Prime Minister Modi) తన ప్రత్యేతక చాటుకుంటూ ఉంటారు. ఏ ప్రాంతానికి వెళ్లినా సరే.. అక్కడి స్థానిక భాషలో ప్రసంగాన్ని మొదలు పెట్టి.. అక్కడి ప్రజల మనసులు తడుతుంటారు. అలాగే.. ఏ రాష్ట్రానికి వెళ్లినా.. అక్కడి నాయకులతో సరదాగా సంభాషిస్తుంటారు. చాలా సరదాగా కలిసిపోతుంటారు. ఇలాంటి సందర్బం మరోసారి అమరావతి(Amaravati) సాక్షిగా కనిపించింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి వచ్చిన ప్రధాని మోదీ.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు.. మంత్రి లోకేశ్ తో చేసిన సరదా సంభాషణ.. ఇందుకు పవన్, లోకేశ్ ఇచ్చిన రిప్లై.. అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ విశేషాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు నాయకులను మోదీ పలకరించిన తీరు.. హైలైట్ అవుతోంది.
సభా వేదికపై ప్రసంగిస్తుండగా కాస్త దగ్గు రావడంతో.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan).. ఇబ్బందిపడ్డారు. అలాగే తన ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఇది గమనించిన ప్రధాని మోదీ ఆ సందర్భంలో మౌనంగానే ఉన్నా.. పవన్ ను ప్రసంగం పూర్తి చేసిన తన దగ్గరకు పిలిపించుకున్నారు. మోదీ పిలుస్తున్నారంటూ చంద్రబాబు చెప్పగా.. పవన్ తన సీటు నుంచి లేచి వచ్చి ప్రధానితో మాట్లాడారు. తన దగ్గరున్న చాక్లెట్ ను పవన్ కు ఇచ్చిన మోదీ.. అభినందనలు తెలిపారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పవన్ తిరిగి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. ఇదంతా చూసిన వేదికపై ఉన్న ప్రముఖులు.. సరదాగా నవ్వుకున్నారు. అలాగే.. పవన్ అంటే తనకు ఎంత ప్రత్యేకం అన్నది మోదీ తన చర్యతో మరోసారి నిరూపించారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో పవన్ పై తన అభిమానాన్ని చూపించిన మోదీ.. ఇప్పుడు అమరావతి వేదికగా అదే పని చేశారంటూ జనసైనికులు సంతోషపడుతున్నారు. ఈ అభిమానం, ఇద్దరి మధ్య అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు.
పవన్ తర్వాత లోకేశ్ వంతు. సభా వేదికపై మంత్రి లోకేశ్ ను కూడా పలకరించారు ప్రధాని మోదీ. లోకేశ్.. నీకెన్నిసార్లు చెప్పాలి.. నన్ను కలవడానికి రావా.. అంటూ ప్రశ్నించారు. గత పర్యటనలోనూ లోకేశ్ ను ఆహ్వానించిన ప్రధాని.. మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేశారు. వెంటనే చిరునవ్వుతో స్పందించిన లోకేశ్.. ఈ సారి తప్పకుండా దిల్లీకి కుటుంబంతో సహా వచ్చి కలుస్తానని బదులిచ్చారు. ఆ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పక్కనే ఉన్నారు. మోదీ, లోకేశ్ మధ్య జరిగిన సంభాషణతో అక్కడ కూడా నవ్వులు పూశాయి. ఇలా.. యువ నేతలతో తనదైన రీతిలో సరదా సరదాగా మాట్లాడిన తీరు.. మోదీ ఈజ్ స్పెషల్ అనిపిస్తున్నాయి. మరోవైపు.. ఈ పర్యటనలో 58 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.. మోదీ.
కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా మారిన టీడీపీ, జనసేనతో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా.. ప్రధాని మోదీ అమరావతి పర్యటనను వినియోగించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.