లేడీ అఘోరీ(Lady Aghori). కొన్నాళ్లుగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఈ వ్యక్తికి.. మళ్లీ రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఓ మహిళను వేధించి, మోసగించిన కేసులో ఈ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పూజల పేరిట మోసం చేసినట్టు బాధిత మహిళ.. సదరు అఘోరీపై ఫిర్యాదు చేసింది. దీంతో.. చేవెళ్ల కోర్టు(Chevella court) ఆదేశాల మేరకు మోకిల పోలీసులు అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను శుక్రవారం నాడు కస్టడీకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి సుమారు 4 గంటల పాటు విచారణ చేశారు. కీలక ఆధారాలు రాబట్టినట్టుగా సమాచారం. బాధితురాలైన మహిళ ఇంటికి కూడా అఘోరిని తీసుకువెళ్లి విచారణ చేశారు. వివరాలు సేకరించారు. తర్వాత.. చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. షాద్ నగర్ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ ను మరో 14 రోజుల పాటు న్యాయస్థానం పొడిగించడంతో.. అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆ బాధిత మహిళ ఏం చెప్పింది అన్న వివరాల ఆధారంగా.. అసలు అఘోరీ ఆమెను ఎలా మోసం చేసిందన్నదీ తేల్చే దిశగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా.. పొంతన లేని సమాధానాలతో పోలీసులను తప్పుదోవ పట్టించేలా అఘోరీ ప్రవర్తించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే.. పోలీసులు అఘోరీ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారని.. కేసును పూర్తి చేసే దిశగా మరింతగా వివరాలు తెలుసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అందుకు తగినట్టుగా.. కోర్టు మరో 14 రిమాండ్ విధించడంతో పోలీసులు అఘోరీని చంచల్ గూడకు తరలించారు. అయితే.. జైలులో అఘోరీ ప్రవర్తన ఎలా ఉందా అని చాలా మంది ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బయట ప్రవర్తించినట్టుగానే వింతవింతగా అఘోరీ అని చెప్పుకుంటూ అల్లూరి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నాడట. ఏది ఏమైనా.. అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్.. చాలా కాలంగా తన ప్రవర్తనతో, తన వరుస పర్యటనలతో మీడియాలో మాత్రం హల్ చల్ చేశాడు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ పాపులర్ అయ్యాడు. సడన్ గా ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతూ జనాన్ని ఆకర్షించాడు. చివరికి.. అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో.. ఓ మహిళ ఫిర్యాదుతో జైలు పాలై.. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. మరి.. ఆ అఘోరీ చేసిన తప్పులపై.. పూర్తి వివరాలను పోలీసులు బయటపెడితే తప్ప.. అతని గురించిన వాస్తవాలు జనానికి తెలిసేలా లేదు.










