కులగణన(caste census) గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy).. మరోసారి ఎమోషనల్ అయ్యారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరైన రేవంత్.. ఈ విషయంపై మాట్లాడారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా.. బ్యూరోక్రాట్ సర్వే మాదిరిగా కాకుండా.. పూర్తిగా ప్రజల కోణంలో ఆలోచించి నిర్వహించిన సర్వే ఇదని ఆయన చెప్పారు. తాము నిర్వహించిన కులగణన ఆధారంగా అభివృద్ధి ఫలాలను, ఉపాధి కల్పనను అందించే దిశగా చర్యలు కూడా ప్రారంభించామని వివరించారు. ఇదే విషయంపై.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా తీర్మానం చేసింది. కులగణను తన పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ.. సమర్థంగా అమలు చేసిందని ప్రశంసించింది. కేంద్రం త్వరలో నిర్వహించనున్న కులగణనకు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలంటూ సమావేశ తీర్మానంలో ప్రస్తావించింది.
ఇదే విషయంపై రేవంత్ రెడ్డి.. ఉద్వేగానికి గురైనట్టు కనిపిస్తోంది. భేటీ అనంతరం.. ఆయన చేసిన పోస్ట్ చూసిన వాళ్లంతా.. ఇది నిజమే అంటున్నారు. రేవంత్ చేసిన ట్వీట్ లోని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా జరగబోయే ఓ సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియకు.. తెలంగాణ రోల్ మాడల్ గా నిలిచింది.. ఇది నాకెంతో గర్వకారణంగా ఉంది. కులగణనకు తెలంగాణను మాడల్ ను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. నాలుగు గోడల మధ్య, నలుగురి ఆలోచనలతో కాకుండా.. పౌర సమాజం, మేధావులు, కులాల సంఘాల నాయకులు, విద్యావేత్తల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని మరీ కులగణన నిర్వహించాం. శాస్త్రీయంగా ప్రక్రియ పూర్తి చేశాం. పూర్తి పారదర్శక విధానంలో ప్రక్రియ నిర్వహించాం. ఇతర రాష్ట్రాలకే కాదు దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఇది మనందరికీ గర్వకారణం.. అంటూ ట్వీట్ చేశారు.. సీఎం రేవంత్ రెడ్డి.
ఇప్పటికే కులగణనపై రేవంత్ చాలా సందర్భాల్లో మాట్లాడారు. తన పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సూచనలతో ఈ ప్రక్రియ పూర్తి చేశామని సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా చెప్పారు. కేవలం కులాల లెక్కలు మాత్రమే తీయడం కాకుండా.. వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన వెనుకబాటును కూడా కచ్చితంగా నిర్థారించి వెలుగులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఇలాంటి పకడ్బందీ విధానంలో ఎక్కడా ఎప్పుడూ కులగణన జరగలేదని స్పష్టం చేశారు. రేవంత్ చేసిన ప్రసంగానికి సీడబ్ల్యూసీ భేటీలో ప్రశంసలు కురిశాయి. అగ్రనేతలంతా తెలంగాణలో కులగణన జరిగిన తీరును అభినందించారు. ఈ కారణంతోనే.. రేవంత్ చాలా ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ఆ భావోద్వేగంతోనే ట్వీట్ చేసి ఉంటారని ఆయన అభిమానులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు.