
మీరు ఈ ఏడాది థాయిలాండ్‌కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఒక ముఖ్యమైన మార్పు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2025 మే నుంచి థాయిలాండ్ ప్రభుత్వం పర్యాటక వీసాలకు కొత్త నిబంధనను అమలు చేసింది. ఇప్పుడు టికెట్, పాస్‌పోర్ట్ సరిపోవు — మీరు మీ ఆదాయాన్ని రుజువు చేసే పత్రాలు కూడా చూపించాల్సి ఉంటుంది.
ఇంతకుముందు, నవంబర్ 2023లో ఈ నిబంధనను రద్దు చేశారు. అయితే ఇప్పుడు తిరిగి ప్రారంభించారు. ఇ-వీసా కోసం దరఖాస్తు చేసే వారు తాము ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
థాయిలాండ్ అధికారిక ఇ-వీసా వెబ్సైట్ ప్రకారం, కనీసం 20,000 థాయ్ బాత్ (సుమారుగా ₹48,000) ఉన్నట్టు నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు చివరి 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, స్పాన్సర్ లెటర్ లేదా ఇతర ఆర్థిక పత్రాలను సమర్పించవచ్చు.
ఈ మార్పు ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, నార్వేలోని థాయ్ రాయబార కార్యాలయాల్లో అమలులో ఉంది. వీసా కోసం ఈ ఆర్థిక ఆధారాలతో పాటు పాస్‌పోర్ట్ కాపీ, ఫోటో, చిరునామా రుజువు, రిటర్న్ టికెట్, బస చేసే ప్రదేశ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం?
పర్యాటకుల పేరుతో థాయిలాండ్‌లోకి ప్రవేశించి, అక్కడే ఉండిపోయే విదేశీయులను నియంత్రించాలన్నది ఈ కొత్త నిర్ణయానికి ప్రధాన కారణం. ఎవరైనా నిజమైన పర్యాటకుడని నిరూపించేందుకు వారి ఆర్థిక స్థితిని పరిశీలించాలనేది థాయిలాండ్ ప్రభుత్వం ఉద్దేశం.
వీసా లేకుండా వెళ్లేవారికి చెడు వార్త
ప్రస్తుతం 93 దేశాల పౌరులు 60 రోజులపాటు వీసా లేకుండానే థాయిలాండ్‌కు వెళ్లవచ్చు. కానీ ఇప్పుడు థాయిలాండ్ ప్రభుత్వం ఈ వ్యవస్థపై తిరిగి పరిశీలన చేపట్టింది. వీసా రహిత బస సమయాన్ని 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.