కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే.. అంటుంటారు నందమూరి నటసింహం అభిమానులు. ప్రేమలో కల్మషం లేని పసితనం.. కోపంలో ఉగ్ర నరసింహావతారం.. అని బాలయ్య గురించి ఆయన సన్నిహితులు కూడా చెబుతుంటారు. అలాంటి బాలయ్య ఓ అమ్మాయికి భయపడతారంటే.. ఎవరైనా నమ్మగలరా? కచ్చితంగా నమ్మరు కదా. కానీ.. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే చెబుతున్నారు. తాను ఓ అమ్మాయికి నిజంగానే భయపడతానని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. తన పెద్ద కూతురు బ్రాహ్మణి అని తెలిపారు. ఆహా ఓటీటీలో తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4.. ఎపిసోడ్ 8లో ఈ టాప్ సీక్రెట్ ను బయటపెట్టారు.. బాలయ్య బాబు.
ఈ ఎపిసోడ్ కు అతిథులుగా దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత నాగవంశీ హాజరయ్యారు. వీళ్లంతా.. సంక్రాంతికి రానున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకూ మహారాజ్ టీమ్ కు చెందిన వారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో.. వీళ్లతో అన్ స్టాపబుల్ లో ఇంటరాక్షన్ లో భాగంగా.. పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు బాలయ్య బాబు. ఇద్దరు కూతుళ్లలో ఎవర్ని ఎక్కువ గారాబం చేసేవారంటూ.. తమన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలకృష్ణ ఈ విషయం చెప్పారు. ఎవరికీ ఇప్పటివరకూ తెలియని టాప్ సీక్రెట్ ను కూడా ఈ సందర్భంగా ఆయన రివీల్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
తన ఇద్దరు బిడ్డలనూ గారాబంగానే పెంచానని చెప్పిన బాలకృష్ణ.. తన పెద్ద కుమార్తెకు హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని గుర్తు చేసుకున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో అవకాశం వస్తే.. బ్రాహ్మణినే వద్దనుకుందని చెప్పారు. అద్దంలో చూస్తూ.. తన చిన్న బిడ్డ తేజస్విని నటించేదని.. ఆమె అయినా నటిగా కెరీర్ ఎంచుకుంటుందేమో అని అనుకున్నానని తెలిపారు. కానీ.. క్రియేటివ్ కన్సల్టెంట్ గా తేజస్విని, బిజినెస్ పర్సన్ గా బ్రాహ్మణి.. ఇద్దరూ మంచి పేరు తెచ్చుకుని స్థిరపడడంపై తండ్రిగా ఎంతో గర్వపడుతున్నట్టు చెప్పి మురిసిపోయారు. ఈ క్రమంలో.. తాను ఎక్కువగా పెద్ద బిడ్డ బ్రాహ్మణికే భయపడతానని చెప్పారు. అలా.. తనను భయపెట్టే కూతురు బ్రాహ్మణి గురించి ప్రేమగా చెప్పి.. అన్ స్టాపబుల్ లో బాలయ్య చేసిన సందడి.. అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.










