ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాన్ని సమూలంగా మార్చే దిశగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తన క్యాబినెట్ లోకి ఎవరూ ఊహించని నాయకులను చేర్చి.. తెలంగాణ రాజకీయాన్ని మరింత రంజుగా మార్చేందుకు ఆయన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకూ ఎదిగి.. క్రికెటర్ గా ప్రతిభను చూపి.. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గానూ సేవలందించిన అజారుద్దీన్ కు.. మైనారిటీ కోటాలో చోటు కల్పించే దిశగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మైనారిటీ కోటాకే చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి.. అధిష్టానానికి బాగా దగ్గరైన షబ్బీర్ అలీకి ఎలా న్యాయం చేస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అజారుద్దీన్ కే గనుక మంత్రిగా అవకాశం దక్కితే.. షబ్బీర్ అలీకి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించి సంతృప్తిపరిచే అవకాశాలున్నాయి. అలాగే.. ఇప్పటికే క్యాబినెట్ లో విపరీతమైన పోటీ నెలకొంది. చాలా కాలంగా మంత్రి హోదా అందుకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు. తనకు అధిష్టానం నుంచి కూడా ఈ మేరకు హామీ ఉందని చాలా కాలంగా ఆయన చెబుతున్నారు. ఆయనతో పాటు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వంటి సీనియర్ నాయకులు.. పదవిని ఆశిస్తున్నారు. సామాజిక వర్గాల కోటా ప్రకారం అయినా.. తమకు విస్తరణలో చోటు దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతానికి ఊహాగానంగా ఉన్న ఈ విషయంలో.. పూర్తి క్లారిటీ రావాలంటే ఫిబ్రవరి చివరి వరకు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో ఆయన పాత్ర కూడా కీలకం. మరోవైపు.. ఈ నెల మూడో వారంలో సీఎం రేవంత్ దావోస్ వెళ్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతారు. అలాగే.. ఆస్ట్రేలియా, సింగపూర్ లోనూ పర్యటించే అవకాశం ఉంది. తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ లెక్కన.. ఫిబ్రవరి చివరి వరకూ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇది గుర్తించిన సీనియర్ నాయకులంతా.. అధిష్టానం దగ్గర తమ పలుకుబడి పెంచుకుని.. మంత్రి పదవి సాధించాలని ప్లాన్ చేస్తున్నారు. ఉన్న సమయాన్ని.. పదవిని సాధించుకునేందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.










