ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంలో.. ఎంత రచ్చ జరిగిందన్నదీ.. గత ఏడాది రెగ్యులర్ అప్ డేట్స్ ను ఫాలో అయ్యే వాళ్లందరికీ తెలుసు. నాగార్జునకు చెందిన ఆ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చేయించిన సందర్భానికి సంబంధించి.. రకరకాల ముచ్చట్లు వినిపించాయి. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, ఒక్క గజం కూడా భూమిని ఆక్రమించలేదని అప్పట్లో చెప్పుకొచ్చిన నాగ్.. తన ఫంక్షన్ హాల్ కూల్చివేతపై కోర్టుకు కూడా వెళ్లారు. అయినా.. రేవంత్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత విషయంలో ఒక్క గజం కూడా వెనక్కు తగ్గలేదు.చివరికి.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయని చెబుతూ.. హైడ్రా అధికారులు కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం.. నాగ్ నే కాదు.. ఆయన కుటుంబాన్ని కూడా ఆవేదన పడేలా చేసింది.
ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ వంతు.ఈమె అయితే ఏకంగా.. నాగార్జున కుటుంబాన్నే వీధికి లాగారు. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణాలపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సెలెబ్రిటీ అని కూడా చూడకుండా.. వారి వ్యక్తిగత విషయాలను బజారుకీడ్చారు. ఇది.. అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా బాధించగా.. సినిమా ఇండస్ట్రీ మొత్తం వారికి అండగా నిలిచింది. సురేఖ తీరును తీవ్రంగా ఖండించింది. ఇంత జరిగినా.. సురేఖ మాట్లాడింది తప్పని కానీ.. ఒప్పని కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా స్పందించలేదు. ఈ మౌనం కూడా అప్పట్లో టాలీవుడ్ తో పాటు ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. ఇంతటి చేదు అనుభవాలు ఉన్నా కూడా.. ఇటీవలి సమావేశంలో నాగార్జున మాత్రం.. చాలా ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.
ఆస్తుల మీద పడ్డారు. వ్యక్తిగత జీవితంపైనా పడ్డారు. పరువును బజార్లో పెట్టారు. అయినా.. నాగార్జున మాత్రం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై కోపం తెచ్చుకోనట్టు కనిపిస్తోంది. అది అవసరమే కావచ్చు.. సంస్కారమే కావచ్చు.. చెప్పుకునేందుకు ఇంకేదైనా కారణం కావచ్చు. ఆయన మాత్రం.. రేవంత్ రెడ్డిని ఇటీవలి సమావేశంలో పలకరించిన తీరైతే.. అందరినీ ఆకర్షించింది. అదే సమయంలో.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కూడా అంతే హుందాగా ప్రవర్తించడం ఆకట్టుకుంది. ఎవరి పని వారిది అన్నట్టుగా ప్రవర్తించిన ఈ ఇద్దరిని చూసినవాళ్లు మాత్రం.. నాగార్జున ఓ మెట్టు తగ్గారా.. లేదంటే అయ్యిందేదో అయ్యింది అనుకుని రేవంత్ రెడ్డే నాగ్ ను చేరదీశారా.. అని జనాలు మాత్రం అమాయకంగా చర్చించుకుంటున్నారు.
పుష్ప 2 సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట.. ఆ తర్వాతి పరిణామాలపై రేవంత్ సీరియస్ అవడం.. ఆ తర్వాత ఈ మీటింగ్ జరగడం.. అందులోనే ఇలాంటి ఆసక్తికర సన్నివేశం కనిపించడం.. ఇది ఫ్యూచర్ లో ఇంకేదైనా విశేషానికి దారి తీస్తుందా అన్న చర్చ జరగడం.. అంటా సినిమాటిక్ గా అనిపిస్తోందని అనలిస్టులు కామెంటే చేస్తున్నారు.