Game Changer : గేమ్ ఛేంజర్‌కు కర్ణాటకలో షాక్?

రామ్ చరణ్ కు కన్నడలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అదీ కాక.. కర్ణాటకలో చాలా మంది తెలుగు తెలిసిన వాళ్లు ఉన్నారు. వీళ్లే.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేవలం.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే సినిమాను విడుదల చేస్తుండడంపై సీరియస్ అవుతున్నారు. కన్నడ భాషలో ఎందుకు అప్ డేట్స్ ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్నారు. ఆ కోపాన్నంతా.. సినిమా పోస్టర్లపై చూపిస్తున్నారు. కలర్ స్ప్రే చల్లుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోలను ఆదరించే కర్ణాటకలో.. గేమ్ ఛేంజర్ గురించి ప్రచారం చేయకపోవడం ఏంటంటూ కామెంట్ చేస్తున్నారు. కనీసం ప్రమోషన్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేయలేదంటూ చిత్ర యూనిట్ పై గరం గరం అవుతున్నారు.

ఈ విషయం కాస్త ఆలస్యంగా చిత్ర యూనిట్ దృష్టికి వచ్చినట్టుంది. అందుకే.. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్టుంది. ఇప్పటికైనా స్పందించకుంటే.. సినిమా విడుదల తర్వాత ఇంకా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించిన మేకర్స్.. చివరికి కన్నడలో గేమ్ ఛేంజర్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. సినిమాకు సంబంధించిన కన్నడ ట్రైలర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కన్నడ భాషలోనే సినిమా డైలాగులను రాసి పోస్టర్ ను కూడా వదిలారు. ఇప్పటివరకూ ఇంగ్లిష్ టైటిళ్లతోనే గేమ్ ఛేంజర్ పోస్టర్లను చూసిన కన్నడవాళ్లు.. తమ భాషలోనూ పోస్టర్లు రిలీజ్ చేయాలంటూ చేసిన డిమాండ్ తో.. ఇలాంటి చర్య తీసుకున్నారు.

అసలే భారీ బడ్జెట్ సినిమా. పైగా.. తెలుగుకు భారీ మార్కెట్ ఉన్న కర్ణాటక. అలాంటి ప్రాంతాన్ని ఎందుకు నిర్మాత దిల్ రాజు పట్టించుకోలేదో అని.. రామ్ చరణ్ అభిమానులు అనుకుంటున్నారు. మిగిలిన సినిమాలు ఐదారు భాషల్లో రిలీజ్ అవుతుంటే.. గేమ్ ఛేంజర్ ను ఎందుకు 3 భాషల్లోనే రిలీజ్ చేయాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్నారు. అందుకే.. ఇలాంటి నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటున్నారు. కాస్త ఆలస్యంగానైనా కన్నడలో పోస్టర్లు వదిలి దిల్ రాజు మంచి పని చేశారని, లేదంటే నష్టం మరింత ఎక్కువగా వచ్చి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. కుదిరితే.. కన్నడ భాషలోనే పూర్తి స్థాయిలో డబ్ చేసి.. సినిమాను విడుదల చేస్తే మంచిదని, ఆ దిశగా దిల్ రాజు ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే.. మిగిలిన భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని కూడా కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here