
వైసీపీ(YCP) సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(peddireddy Ramchandra reddy), కొడాలి నాని(Kodali nani).. ఒకే రోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రమాదవశాత్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాత్ రూమ్ లో కాలు జారి పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆయన కుడిచేయి ఎముక చిట్లినట్టు నిర్థారించారని తెలుస్తోంది. సర్జరీ తర్వాత.. పెద్దిరెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని సమాచారం అందుతోంది. విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ కు చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరాటపడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థంచారు.
మరోవైపు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయిన కొడాలి నాని కూడా.. సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. కొన్ని మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు.. నానికి గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టుగా గుర్తించారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం.. కొడాలి నాని చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసి నాని అభిమానులు కూడా కంగారుపడ్డారు. హైదరాబాద్ లో తమకు తెలిసిన వారి ద్వారా.. నాని ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని.. ఇద్దరూ సీనియర్ నేతలే. ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ ఇద్దరూ ఎంతో అండగా నిలిచారు. ప్రత్యర్థి పక్షాలపై మాటలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా.. నాని అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై చేసిన మాటల దాడిని.. ఎవరూ మర్చిపోలేరు. మంత్రులుగా, నాయకులుగా పార్టీ విషయంలో అంతటి దూకుడు చూపిన నేతలు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. ఇంతలో.. ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారు. వారి అనారోగ్యం గురించి.. అధినేత జగన్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నారని వైసీపీ నేతలు చెబతున్నారు.