
పార్టీ ఫిరాయింపులపై.. తెలంగాణ అధికార, ప్రతిపక్షాల మధ్య ఇంట్రెస్టింగ్ డైలాగ్ వార్ జరుగుతోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానే రావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy) చెప్పడంపై.. ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల విషయంలో.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తిప్పికొట్టేలా కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారని రేవంత్ అనుమాన పడుతున్నారేమో అంటూ.. హరీష్ రావు అనూహ్య కామెంట్లు చేశారు. అందుకే.. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ.. రేవంత్ రెడ్డి శాసనసభలో కామెంట్లు చేశారని హరీష్ అన్నారు.
అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ హరీష్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని.. ఈ వ్యవహారంపై చట్టసభల్లో మాట్లాడకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని హరీష్ రావు అన్నారు. కోర్టు పరిధిని అధిగమించి మరీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఆరోపించారు. సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై.. రేవంత్ రెడ్డి జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి అని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చేందుకు తాను శాసనసభలో ప్రయత్నం చేస్తుంటే.. మైక్ ఆపేస్తూ తాను మాట్లాడకుండా అడ్డుకుంటున్నారని హరీష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సహజంగానే.. హరీష్ రావు కామెంట్లపై కాంగ్రెస్ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కేసులో.. తమకే తీర్పు అనుకూలంగా వస్తుందని వారు నమ్మకంగా చెబుతున్నారు. కానీ.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ కు దూరం అవుతారేమోనని.. రేవంత్ అనుమాన పడుతున్నారంటూ హరీష్ రావు చేసిన కామెంట్లు.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అసలు ఉప ఎన్నికలే రాష్ట్రంలో రావంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ కు రేవంత్ కౌంటర్ ఇస్తే ఆయనకు హరీష్ రావు ఎన్ కౌంటర్ లాంటి రిప్లై ఇచ్చారని.. గులాబీ పార్టీ నేతలు అంటున్నారు.